
భారత్‌ను గెలిపించిన మిథాలీ
న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే
బెంగళూరు: మిథాలీ రాజ్ (88 బంతుల్లో 81 నా టౌట్; 10 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత మహిళల క్రికెట్ జట్టు పరాజయాలకు బ్రేక్ పడింది. సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై నెగ్గింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 49.5 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సోఫీ డెవిన్ (102 బంతుల్లో 89; 10 ఫోర్లు; 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. నిరంజన, రాజేశ్వరిలకు మూడేసి వికె ట్లు దక్కాయి.
అనంతరం బరిలోకి దిగిన భారత్ 44.2 ఓవర్లలో రెండు వికెట్లకు 221 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ స్మృతి మందానా (99 బంతుల్లో 66; 8 ఫోర్లు)తో కలిసి మిథాలీ రెండో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివర్లో హర్మన్‌ప్రీత్ కౌర్ (25 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు; 2 సిక్సర్లు) వేగంగా ఆడింది. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 2-2తో సమానంగా ఉన్నాయి. చివరి వన్డే బుధవారం ఇదే వేదికపై జరుగుతుంది. తన సూపర్ ఆటతీరుతో ఆకట్టుకున్న మిథాలీ మహిళల వన్డే చరిత్రలో 5 వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌వుమన్‌గా.. తొలి భారత క్రికెటర్‌గా నిలిచింది. తొలి స్థానంలో చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) కొనసాగుతోంది. భారత గడ్డపై 221 పరుగుల లక్ష్యఛేదన ఏ జట్టుకైనా ఇదే తొలిసారి కావడం విశేషం.