
ICC Women World Cup 2022 Ind Vs Aus- Mithali Raj: గత కొన్ని రోజులుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతూ వరల్డ్‌కప్-2022 టోర్నీలో నిరాశ పరిచిన భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించింది. ప్రపంచకప్ ఈవెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అర్ధ శతకం బాదింది. 77 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించింది. కాగా మిథాలీ కెరీర్‌లో ఇది 63వ అర్ధ శతకం.
ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా మిథాలీ రాజ్ సరికొత్త రికార్డు సృష్టించింది. మహిళా ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సార్లు(12) హాఫ్ సెంచరీ ప్లస్ స్కోరు చేసిన క్రికెటర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ రికార్డును అధిగమించింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబీ హాక్లేతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచింది.
ఇక కెప్టెన్‌గానూ మిథాలీకి ఈ మెగా ఈవెంట్‌లో యాభై కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఎనిమిదోసారి. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సారథిగా మిథాలీ నిలిచింది. ఆమె తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ ఆరు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో రెండో స్థానంలో ఉంది. కాగా ప్రపంచకప్ సెమీస్ చేరాలంటే, బలమైన జట్టుగా పేరొందిన ఆస్ట్రేలియాతో కీలక పోరులో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.
యస్తికా భాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్(68), హర్మన్ ప్రీత్ కౌర్ (57) అర్ధ శతకాలతో రాణించారు. ఇక అంతకుముందు వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా మిథాలీ రాజ్ నిలిచింది. తద్వారా ఆస్ట్రేలియా సారథి బెలిండా క్లార్క్(23 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును ఆమె బ్రేక్ చేసింది.
చదవండి: Women WC 2022- Mithali Raj: 5 పరుగులకే అవుట్ అయినా.. ప్రపంచకప్ టోర్నీలో మిథాలీ అరుదైన రికార్డు