Women's World Cup 2022: Australia Women's Beat India Women's by 6 Wickets - Sakshi
Sakshi News home page

World Cup 2022: మిథాలీ సేనకు షాక్‌.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆసీస్‌

Published Sat, Mar 19 2022 2:11 PM | Last Updated on Sat, Mar 19 2022 3:40 PM

ICC Women World Cup 2022: Australia Beat India By 6 Wickets Enters Semis - Sakshi

 ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్‌-2022లో భాగంగా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా మరోసారి అదరగొట్టింది. భారత మహిళా జట్టుతో ఆక్లాండ్‌ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీలో ఐదో విజయాన్ని నమోదు చేసింది.

ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి సగర్వంగా సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. మరోవైపు.. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలైన మిథాలీ సేనకు నిరాశ తప్పలేదు.

టాస్‌ గెలిచి..
మిథాలీ సేనతో మ్యాచ్‌లో భాగంగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎంచుకుంది. ఆసీస్‌ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ స్మృతి మంధాన 10 పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ (12 పరుగులు) నిరాశపరిచింది. అయితే, యస్తికా భాటియా (59), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(68) స్కోరు బోర్డును పరిగెత్తించారు.

కానీ ఆసీస్‌ బౌలర్‌ డార్సీ బ్రౌన్‌ వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టి జట్టును దెబ్బకొట్టింది. ఆ తర్వాత వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 57 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఇక ఆఖర్లో బ్యాట్‌ ఝులిపించిన పూజా వస్త్రాకర్‌ 34 పరుగులు సాధించింది. ఈ క్రమంలో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు స్కోరు చేసింది.

ఆది నుంచి దూకుడుగా..
278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ ఆది నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు రేచల్‌ హేన్స్‌(43), అలీసా హేలీ(72) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వీరికి తోడు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ 97 పరుగులు సాధించి జట్టు విజయానికి బాటలు వేసింది. అయితే, మధ్యలో వరుణుడి ఆటంకం, గెలుపునకు 31 పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోవడం ఉత్కంఠను పెంచాయి.

సగర్వంగా సెమీస్‌కు
ఈ క్రమంలో సెంచరీకి చేరువైన లానింగ్‌ను మేఘనా సింగ్‌ అవుట్‌ చేయడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే, ఆఖరి మూడు బంతుల వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌దే పైచేయి అయింది. ఝులన్‌ గోస్వామి బౌలింగ్‌లో బెత్‌ మూనీ వరుస ఫోర్లు కొట్టి ఆసీస్‌ విజయాన్ని ఖరారు చేసింది. ఫోర్‌ బాది జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చింది. ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. 

ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా స్కోర్లు:
ఇండియా- 277/7 (50)
ఆస్ట్రేలియా- 280/4 (49.3)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement