
స్మృతి (78), షఫాలీ (96)
బ్రిస్టల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు భారత మహిళల క్రికెట్‌లో కొత్త కెరటాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇప్పటి వరకు కెరీర్‌లో టి20లు మాత్రమే ఆడిన షఫాలీ వర్మ టెస్టుల్లో కూడా తాను సత్తా చాటగలనంటూ తొలి మ్యాచ్‌లోనే నిరూపించింది. మ్యాచ్ రెండో రోజు అద్భుత ప్రదర్శన కనబర్చిన షఫాలీ (152 బంతుల్లో 96; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకుంది. అయితే తొలి మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా ఈ టీనేజర్ నిలిచింది. షఫాలీకి తోడుగా స్మృతి మంధాన (155 బంతుల్లో 78; 14 ఫోర్లు) కూడా ఆకట్టుకోవడంతో గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
షఫాలీ, స్మృతి తొలి వికెట్‌కు ఏకంగా 167 పరుగులు జోడించడం విశేషం. అయితే ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి 20 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లతో పాటు శిఖా పాండే (0), కెప్టెన్ మిథాలీ రాజ్ (2), పూనమ్ రౌత్ (2) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ (4 బ్యాటింగ్), దీప్తి శర్మ (0 బ్యాటింగ్) జట్టును ఆదుకోవాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 59 పరుగులు చేయా ల్సి ఉంది. అంతకు ముందు 269/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 396 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment