గాలే: తొలి వన్డేలో భారత మహిళల జట్టు శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ఐసీసీ మహిళల చాంపియన్ షిప్‌లో భాగంగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ప్రత్యర్థిపై గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 35.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జయంగని (33; 2 ఫోర్లు) టాప్‌స్కోరర్ కాగా, వీరక్కొడి (26) ఫర్వాలేదనిపించింది.
మిగతా వారంతా భారత పేస్, స్పిన్ ఉచ్చులో పడ్డారు. మాన్సి జోషి 3, జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు. దీప్తి, హేమలత, రాజేశ్వరిలకు ఒక్కో వికెట్ దక్కింది. తర్వాత సునాయాస లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగులు చేసి గెలిచింది. స్మృతి మంధాన (76 బంతుల్లో 73 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, పూనమ్ రౌత్ 24 పరుగులు చేసింది. రెండో వన్డే గురువారం ఇక్కడే జరుగుతుంది.
►అంతర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన తొలి మహిళా బౌలర్‌గా జులన్ గోస్వామి చరిత్రకెక్కింది.
►మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మొదటి కెప్టెన్ మిథాలీ రాజ్. ఆమె 118 వన్డేలకు నాయకత్వం వహించింది.
Comments
Please login to add a commentAdd a comment