సాక్షి, హైదరాబాద్: ఆడపిల్లలను ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తారని, క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని టీమిండియా కెప్టెన్ మిథాలీరాజ్ అన్నారు. సికింద్రాబాద్ కీస్ హైస్కూల్ పూర్వ విద్యార్థిని అయిన మిథాలీని శుక్రవారం పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అమ్మాయిలకు ఆసక్తి ఉన్న రంగాన్నే కెరీర్‌గా ఎంచుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.
తన ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే క్రికెట్‌లో రాణించానని, వారి ఆదరణ, సహకారం మరవలేనిదని గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే ఈస్థాయికి ఎదిగానని ఆమె చెప్పారు. మహిళలు ఇప్పుడిప్పుడే క్రీడల్లో రాణిస్తున్నారని, భవిష్యత్‌లో ఇది మరింత పెరగాలని ఆకాంక్షించారు. అనంతరం తనకు విద్యాబోధన చేసిన గురువులను మిథాలీరాజ్ సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జ్ఞానశ్రీ, వైస్ ప్రిన్సిపల్ పద్మిని కృష్ణన్, మిథాలీరాజ్ తల్లిదండ్రులు దొరైరాజ్, లీల, పలువురు ఉపా ధ్యాయులు, పూర్వ అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment