చక్‌దా ఎక్స్‌ప్రెస్‌.. స్పెషల్‌ స్టోరీ ఆన్‌ ఇండియన్‌ టైగ్రెస్‌ ఝులన్‌ గోస్వామి | Sakshi Funday Story On Jhulan Goswami | Sakshi
Sakshi News home page

చక్‌దా ఎక్స్‌ప్రెస్‌.. స్పెషల్‌ స్టోరీ ఆన్‌ ఇండియన్‌ టైగ్రెస్‌ ఝులన్‌ గోస్వామి

Published Tue, Nov 8 2022 3:44 PM | Last Updated on Mon, Dec 5 2022 12:39 PM

Sakshi Funday Story On Jhulan Goswami

కళ్లల్లో లక్ష్యం.. పరుగులో వేగం.. వెరసి స్టేడియంలో మెరుపు.. పిచ్‌లో స్టంప్‌ అవుట్స్‌! ఆ టైగ్రెస్‌ పేరు ఝులన్‌ గోస్వామి! ఆమె ఉంటే సొంత జట్టుకి ఉత్సాహం..  ప్రత్యర్థి జట్టుకి ఇరకాటం! విమెన్‌ క్రికెట్‌కు ఆమె ఓ సిగ్నేచర్‌! 

2022 సెప్టెంబర్‌ 24.. లండన్‌లోని లార్డ్స్‌ స్టేడియం.. 39 ఏళ్ల లెజండరీ క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి రిటైర్మెంట్‌ అనౌన్స్‌మెంట్‌ సమయం! టాస్‌ వేయాల్సిందిగా ఆమెనే పిలిచింది కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కన్నీళ్లతో. ఆ మ్యాచ్‌లో ఝులన్‌ తన కెరీర్‌లోనే ఆఖరి బాల్‌ వేస్తున్నప్పుడు టీమ్‌తో పాటు ప్రేక్షకుల మనసూ బరువెక్కింది. మ్యాచ్‌ అయిపోయాక ఇంగ్లండ్‌ టీమ్‌.. ఇండియా టీమ్‌ ఆమెకు గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ ఇచ్చారు. క్రికెటే జీవితంగా భావించిన ఝులన్‌కు అది కోరుకున్న నిష్క్రమణే అయినా.. తన శరీరం నుంచి హృదయాన్ని వేరు చేస్తున్న వేదన.. ఆమె బౌలింగ్‌ అంత వేగంగా పొట్టలోంచి ఉబికి వస్తున్న దుఃఖం కన్నీళ్లుగా కారకుండా కష్టంగా ఆపుకొంది! 

తన ఎడబాటుతో ఝులన్‌ను అంత వేదనకు గురిచేసిన ఆ ఆట ఆమెకు పరిచయమై ఆసక్తి కలిగిన సందర్భం.. 1992.. వరల్డ్‌ కప్‌! ఝులన్‌ వాళ్ల అన్న, కజిన్స్‌ క్రికెట్‌కు పెద్ద ఫ్యాన్స్‌. దాంతో టీవీలో వస్తున్న 1992 వరల్డ్‌ కప్‌ మ్యాచెస్‌ను ఉత్కంఠతో చూస్తున్నారు. వాళ్లతోపాటు పదేళ్ల ఝులన్‌ కూడా చూడాల్సి వచ్చింది అనివార్యంగా. అప్పటిదాకా ఆమె దృష్టిలో ఆటంటే ఫుట్‌బాలే. కానీ ఆ వరల్డ్‌ కప్‌ ఆమె దృష్టిని మార్చేసింది. క్రికెట్‌ మీదకు మళ్లించింది. ఆసక్తిని కలిగించింది. నాటినుంచి గల్లీలో అబ్బాయిలతో కలసి ఆడడం స్టార్ట్‌ చేసింది.  బౌలింగ్‌ అంటే ఇష్టం. కానీ స్లోగా చేసేది. దాంతో అబ్బాయిలంతా ఆమెను గేలి చేసేవాళ్లు. ఆ హేళన ఆమెలో కసిని పెంచింది.. ఎంతలా అంటే బౌలింగ్‌ వేగం గంటకు 120 కిలోమీటర్లకు చేరి వరల్డ్‌ ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా ఆమెను నిలబెట్టేంతగా! 

క్రికెటే లక్ష్యంగా మారిన సమయం..
కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్‌.. 1997మహిళా క్రికెట్‌ ప్రపంచ కప్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఆ స్టేడియంలో ఝులన్‌ బాల్‌ గర్ల్‌. అమ్మాయిలు క్రికెట్‌ ఆడుతుంటే చూడటం అదే తొలిసారి. బెలిండా క్లార్క్‌ ఆట ఆమెను కట్టిపడేసింది.. క్రికెట్‌ను ప్రేమించేలా చేసింది. అంతే అప్పటికప్పుడు ఝులన్‌ నిర్ణయించేసుకుంది ఏది ఏమైనా తాను కూడా భారతదేశం తరపున ఆడాలని! కానీ తనుంటున్న చక్‌దా పల్లెటూరు. బడి అంటే ఓకే కానీ ఆటలను నేర్పించేంత సౌకర్యాలు తన ఊళ్లో లేవు. 

శిక్షణ కోసం కోల్‌కతా వెళ్లాల్సిందే. ఝులన్‌ నోటి వెంట ఆ మాట వినడమే ఆలస్యం ‘వద్దు’ అని చెప్పేశారు అమ్మా, నాన్న ముక్త కంఠంతో. ఆడపిల్లకు చదువుతో పాటు ఆట, పాట ఉండాలి అంటే ఏకంగా క్రికెట్‌కే గురి పెడతావా? పెళ్లికావాల్సిన పిల్లవి.. రేప్పొద్దున ఏదన్నా తేడా జరిగితే పెళ్లి అవుతుందా? అంటూ ఆందోళనా వ్యక్తం చేశారు. కాని దేశానికి స్వాతంత్య్రం సిద్ధించకముందు పుట్టిన ఝులన్‌ నానమ్మకు తెలుసు ఆడపిల్లకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ఎంత అవసరమో! అందుకే ‘ఆడపిల్లలు అన్నిట్లో ముందుండాలి. దేనికీ అధైర్యపడొద్దు. నచ్చిన పని చేయాలి’ అంటూ ఝులన్‌ను ప్రోత్సహించింది. 

‘నాకు రెండేళ్లు టైమ్‌ ఇవ్వండి.. క్రికెట్‌లో ఝులన్‌ను స్టార్‌ను చేస్తా’ అంటూ కోచ్‌ స్వపన్‌ సాధు కూడా ఆమె కుటుంబాన్ని ఒప్పించాడు. ‘ఎంతో మంది ఆడ పిల్లలకు శిక్షణ నిచ్చా.. కాని నీలాగా హై ఆర్మ్‌ బౌలింగ్‌ చేసేవాళ్లను చూడలేదు. ఇంత టాలెంట్‌ని వృథా పోనివ్వను. క్రికెట్‌కే నిన్ను ఓ అసెట్‌లా తీర్చిదిద్దుతా’ అంటూ కోచ్‌గానే కాదు గైడ్, ఫిలాసఫర్‌గా ఆమెకు అండగా నిలిచాడు స్వపన్‌ సాధు. అలా ఝులన్‌ తన క్రికెట్‌ కలను నేరవేర్చుకోవడానికి.. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కోల్‌కతా ప్రయాణమైంది.  

2007– 08 నుంచి ఆటగాళ్లకి ర్యాంకింగ్‌ సిస్టమ్‌ మొదలైంది. బౌలర్లలో ఝులన్‌ది నంబర్‌ వన్‌ ర్యాంక్‌. ఐసీసీ ఆమెకు గోల్డెన్‌ ఆర్మ్‌ బ్యాండ్‌ను బహుకరించింది. అలా కోచ్‌ ఊహించినట్టుగానే క్రికెట్‌ స్టార్‌ అయింది. ఓ ‘అద్భుతం’గా రికార్డ్‌ అయింది! ‘ప్రతిరోజూ ఉదయం ఏడున్నర కల్లా గ్రౌండ్‌లో ఉండాల్సిందే. లేకపోతే ఆరోజు ఆడనిచ్చేవాడు కాదు కోచ్‌. అందుకే పొద్దున్నే ఐదింటికల్లా  సీల్దా నుంచి బాలిగంజ్‌ ట్రైన్‌లో బయలుదేరేదాన్ని. అందులో అందరూ స్పోర్ట్స్‌పర్సన్సే ఉండేవారు. అబ్బాయిలు, అమ్మాయిలం  ఒక గ్రూప్‌గా బోల్డు కబుర్లు చెప్పుకుంటూ వెళ్లేవాళ్లం. 

పొరపాటున ట్రైన్‌  మిస్‌ అయితే జీవితంలో ఒకరోజు కోల్పోయిన ఫీల్‌ ఉండేది. ఏమైనా అవి బంగారు రోజులు’ అంటూ తన కోచింగ్‌ రోజులను గుర్తు చేసుకుంటుంది ఝులన్‌. ‘మా ఆటకు స్టేడియం ఖాళీగా ఉంటుంది. జనం కొట్టే జేజేలు, కేరింతలు లేకున్నా మా ఉత్సాహం ఏ మాత్రం తగ్గదు. నాకైతే ఎదురుగా బ్యాట్‌తో సిద్ధంగా ఉన్న ప్రత్యర్థి, స్టంప్స్‌ మాత్రమే కనిపించేవి. ప్రత్యర్థిని ఎలా ఔట్‌ చేయాలన్న ఏకైక లక్ష్యంతో దూసుకుపోయేదాన్ని’ అంటూ తన ఆట తీరును నెమరువేసుకుంటుంది ఝులన్‌.  

రిటైర్మెంట్‌ తర్వాత..
మ్యాచెస్‌లేని రోజులను ఊహించడం కష్టమే అయినా క్రికెట్‌ వల్ల వాయిదా పడ్డ పనులెన్నిటినో చేసుకోవడానికి కావల్సినంత సమయం దొరికింది అని తన మనసుకు నచ్చజెప్పుకుంటోంది ఝులన్‌. ‘ఇప్పుడిక దేనికీ ఏ రోక్‌టోక్‌ (ఆటంకం) లేదు. బిందాస్‌గా స్ట్రీట్‌ ఫుడ్‌ తింటా.. చక్కగా  దుర్గా పూజను ఆస్వాదిస్తా’నంటూ తనేం చేయాలను కుందో చెప్పు కొచ్చింది. ‘2009 ప్రపంచ కప్‌ తర్వాత రిటైర్‌ అయిపోవాలి అనుకున్నా. ఇప్పటికి ఆ నిర్ణయం తీసుకోగలిగా. 

ఇండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్‌లోకి వెళ్లడం, బౌలింగ్‌ చేయడం, నేషనల్‌ యాంథమ్‌ పాడటం వంటి అనుభూతులన్నిటినీ మిస్‌ అవుతాను’ అంటూ రిటైర్‌మెంట్‌ మిగిల్చే లోటునూ పంచుకుంది. ‘నా తొలి టెస్ట్‌ మ్యాచ్, తొలి వన్‌ డే మ్యాచ్, టీ20 డెబ్యూ కూడా ఇంగ్లండ్‌తోనే. చిత్రమేంటంటే  నా ఆఖరి మ్యాచ్‌ కూడా ఇంగ్లండ్‌తోనే. బ్రిటిషర్స్‌ మన దేశాన్ని పాలించిన చరిత్ర వింటూ పెరిగినందువల్లో ఏమో ఇంగ్లండ్‌ అంటే నాకు కోపం. ఆ సంగతి మా కెప్టెన్‌కీ తెలుసు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ అప్పుడు ‘నీ కసికొద్దీ బాల్‌ని కొట్టిరా’ అంటూ బౌలింగ్‌కు పంపించేది’ అని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ఝులన్‌. 

గ్రాఫ్‌ అండ్‌ గ్రేస్‌

  •       2007–ఐసిసి విమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా గౌరవం పొందింది.
  •      (2008–2011)–విమెన్స్‌ క్రికెట్‌ కెప్టెన్‌
  •      204 మ్యాచుల్లో 255 వికెట్లతో అత్యధికంగా వికెట్లు తీసుకున్న ప్లేయర్‌గా నిలిచింది.
  •      2010–అర్జున, 2012–పద్మశ్రీ అవార్డులను అందుకుంది.
  •      అనుష్క శర్మ నటిస్తున్న ఝులన్‌ బయోపిక్‌ చక్‌దా ఎక్స్‌ప్రెస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతోంది.  
  •      ఆటకు అన్యాయం చేస్తానేమో అనే భయంతో పెళ్లి కూడా వద్దనుకుంది.
  •      కొన్ని ఫ్యాషన్‌ షోల్లోనూ పాల్గొంది.
  •     ఝులన్‌ గౌరవార్థం పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేసింది ప్రభుత్వం.

జె.. పాజీ.. బాబుల్‌
టీమ్‌లో నేనే వరస్ట్‌ డాన్సర్‌నని ఆట పట్టిస్తారంతా. నేను క్రికెటర్ని మరి.. డాన్సర్‌ని కాదుగా! టీమ్‌లో అల్లరిపిల్ల అంటే వేద. ఝులన్‌ దీదీ..  ఝులన్‌ దీ.. ఝులన్‌ నుంచి ఇప్పుడు జె అని పిలిచేవరకు వచ్చింది ఆ పిల్ల తీరు.  ‘నా పేరుమొత్తం కట్‌ చేసేశావ్, నన్ను టీమ్‌ నుంచి బయటకు మాత్రం పంపకు’ అని జోక్‌ చేసేదాన్ని. హర్మన్‌ పూర్తిగా పంజాబీ యాక్సెంట్‌లోనే మాట్లాడుతుంటుంది. నాకొచ్చిన ఒకేఒక్క పంజాబీ పదం పాజీ. నేను తనని పాజీ  అనేదాన్ని. అలా తను  నాకు పాజీ అని పేరు పెట్టేసింది. చాలామంది బాబుల్‌ అని కూడా పిలుస్తారు.

ఝులన్‌ గురించి మిథాలి..
‘నాకు ఝులన్‌ అండర్‌ 19లో రాయ్‌ బరేలీలో ఆడినప్పటి నుంచి తెలుసు. అప్పుడు గ్రౌండ్‌ వెనుక ఉన్న హాస్టల్‌లో మాకు బస. నా గది కిటికీ నుంచి ఝులన్‌ను మొదటిసారి చూశా. బోరింగ్‌ పంప్‌ కొట్టి బకెట్‌లో నీళ్లు నింపి అక్కడే కూర్చుని బ్రష్‌ చేసుకుంటోంది. తన మొదటి బంతి క్యాచ్‌ చేయడం కూడా నాకు గుర్తు. చాలా కష్టపడి ఆడే అమ్మాయి. ప్రాక్టీస్‌ టైమ్‌లో కూడా తనతో పోటీ పడటం కష్టమే. ఎవరిలో లేని లక్షణం ఒకటి ఆమెలో ఉంది. మేం ఆటలో ఓడుతున్నా, గెలుస్తున్నా ఝులన్‌ ఏదో ఒక కార్నర్‌లో ఉండి టీమ్‌ని ఎంకరేజ్‌ చేస్తూ కనిపిస్తుంటుంది.’ 

గెలిచే వరకు.. 
పద్దెనిమిదేళ్ల పాటు నేను, మిథాలీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. వరల్డ్‌ కప్‌ గెలవలేకపోయాం. మన విమెన్‌ టీమ్‌ ప్రపంచ కప్‌ గెలవాలి. విమెన్‌ టీం ప్రపంచ కప్‌ గెలిస్తే చాలు. గెలిచే వరకు ఆ కలను కంటూనే ఉంటాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement