indian bowler
-
సిరాజ్ పెర్ఫార్మెన్స్కు ఆనంద్ మహీంద్రా ఫిదా.. కార్ ఇచ్చేయండి సార్..
భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్-2023 (Asia Cup) ఫైనల్ మ్యాచ్ కొలొంబో వేదికగా ఈరోజు (సెప్టెంబర్ 17) జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆల్అవుట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 51 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఆసియా కప్ భారత్ వశమైంది. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దిగిన భారత్ బౌలర్లు విజృంభించారు. శ్రీలంక టాప్ బ్యాంటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ముఖ్యంగా నాలుగో ఓవర్లో భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కేవలం నాలుగు పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ 6 వికెట్లు సాధించాడు. మహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఫిదా అయ్యారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. సిరాజ్ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ మీరు ఒక మార్వెల్ అవెంజర్ అంటూ మహమ్మద్ సిరాజ్‌ను అభినందించారు. ఈ పోస్ట్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. ‘సార్ సిరాజ్‌కు ఎస్యూవీ గిఫ్ట్ ఇచ్చేయండి’ అంటూ కోరగా దానికి ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ కచ్చితంగా ఇస్తానంటూ పేర్కొన్నారు. I don’t think I have EVER before felt my heart weep for our opponents….It’s as if we have unleashed a supernatural force upon them… @mdsirajofficial you are a Marvel Avenger… https://t.co/DqlWbnXbxq — anand mahindra (@anandmahindra) September 17, 2023 -
అర్షదీప్‌ను ఇక్కడ ప్రాక్టీస్ చేయించండి.. నో బాల్స్ ఎలా వేస్తాడో చూద్దాం..!
టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్ నో బాల్స్ వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేల ఓ ఆసక్తికర కార్టూన్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. శ్రీలంకతో మొన్న (జనవరి 5) జరిగిన రెండో టీ20లో ఏకంగా 5 నో బాల్స్ వేసి టీమిండియా ఓటమికి పరోక్ష కారణమైన అర్షదీప్‌కు భారత అభిమాని ఒకరు కార్టూన్ ద్వారా ఓ సలహా ఇచ్చాడు. అర్షదీప్ జీవితంలో ఒక్క నో బాల్ కూడా వేయకుండా ఉండాలంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయించండి అంటూ ఓ కార్టూన్‌ను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ కార్టూన్లో బౌలర్ పర్వతం అంచున ఉన్న క్రీజ్ గుండా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బౌలర్ క్రీజ్ దాటి నో బాల్ వేస్తే లోయలో పడిపోతాడు. అర్షదీప్ కోసం సరదాగా పోస్ట్ చేసిన ఈ కార్టూన్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసిన నెటిజన్లు.. అవును ఇది కరెక్టే.. ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తే అర్షదీపే కాదు ప్రపంచంలో ఏ బౌలర్ కూడా క్రీజ్ దాటి నో బాల్ వేసే సాహసం చేయలేడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. This is the Special pitch to practice for #arshdeepsingh #INDvSL #UmranMalik pic.twitter.com/FeqwaZUVeq — Abhijit sarkar (@singlecoreGG) January 6, 2023 కాగా, శ్రీలంకతో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ బౌల్ చేసిన అర్షదీప్ వరుసగా మూడు నోబాల్స్ సంధించాడు. ఆతర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మరో రెండు నో బాల్స్ వేసి అభిమానులు, సహచరులతో సహా విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 2 ఓవర్లు వేసిన అర్షదీప్ ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని టీమిండియా ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైన విషయం తెలిసిందే. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇవాళ (జనవరి 7) రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది. -
చక్దా ఎక్స్‌ప్రెస్.. స్పెషల్ స్టోరీ ఆన్ ఇండియన్ టైగ్రెస్ ఝులన్ గోస్వామి
కళ్లల్లో లక్ష్యం.. పరుగులో వేగం.. వెరసి స్టేడియంలో మెరుపు.. పిచ్‌లో స్టంప్ అవుట్స్! ఆ టైగ్రెస్ పేరు ఝులన్ గోస్వామి! ఆమె ఉంటే సొంత జట్టుకి ఉత్సాహం.. ప్రత్యర్థి జట్టుకి ఇరకాటం! విమెన్ క్రికెట్‌కు ఆమె ఓ సిగ్నేచర్! 2022 సెప్టెంబర్ 24.. లండన్‌లోని లార్డ్స్ స్టేడియం.. 39 ఏళ్ల లెజండరీ క్రికెటర్ ఝులన్ గోస్వామి రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ సమయం! టాస్ వేయాల్సిందిగా ఆమెనే పిలిచింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కన్నీళ్లతో. ఆ మ్యాచ్‌లో ఝులన్ తన కెరీర్లోనే ఆఖరి బాల్ వేస్తున్నప్పుడు టీమ్‌తో పాటు ప్రేక్షకుల మనసూ బరువెక్కింది. మ్యాచ్ అయిపోయాక ఇంగ్లండ్ టీమ్.. ఇండియా టీమ్ ఆమెకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. క్రికెటే జీవితంగా భావించిన ఝులన్‌కు అది కోరుకున్న నిష్క్రమణే అయినా.. తన శరీరం నుంచి హృదయాన్ని వేరు చేస్తున్న వేదన.. ఆమె బౌలింగ్ అంత వేగంగా పొట్టలోంచి ఉబికి వస్తున్న దుఃఖం కన్నీళ్లుగా కారకుండా కష్టంగా ఆపుకొంది! తన ఎడబాటుతో ఝులన్‌ను అంత వేదనకు గురిచేసిన ఆ ఆట ఆమెకు పరిచయమై ఆసక్తి కలిగిన సందర్భం.. 1992.. వరల్డ్ కప్! ఝులన్ వాళ్ల అన్న, కజిన్స్ క్రికెట్‌కు పెద్ద ఫ్యాన్స్. దాంతో టీవీలో వస్తున్న 1992 వరల్డ్ కప్ మ్యాచెస్‌ను ఉత్కంఠతో చూస్తున్నారు. వాళ్లతోపాటు పదేళ్ల ఝులన్ కూడా చూడాల్సి వచ్చింది అనివార్యంగా. అప్పటిదాకా ఆమె దృష్టిలో ఆటంటే ఫుట్‌బాలే. కానీ ఆ వరల్డ్ కప్ ఆమె దృష్టిని మార్చేసింది. క్రికెట్ మీదకు మళ్లించింది. ఆసక్తిని కలిగించింది. నాటినుంచి గల్లీలో అబ్బాయిలతో కలసి ఆడడం స్టార్ట్ చేసింది. బౌలింగ్ అంటే ఇష్టం. కానీ స్లోగా చేసేది. దాంతో అబ్బాయిలంతా ఆమెను గేలి చేసేవాళ్లు. ఆ హేళన ఆమెలో కసిని పెంచింది.. ఎంతలా అంటే బౌలింగ్ వేగం గంటకు 120 కిలోమీటర్లకు చేరి వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఆమెను నిలబెట్టేంతగా! క్రికెటే లక్ష్యంగా మారిన సమయం.. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్.. 1997మహిళా క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతోంది. ఆ స్టేడియంలో ఝులన్ బాల్ గర్ల్. అమ్మాయిలు క్రికెట్ ఆడుతుంటే చూడటం అదే తొలిసారి. బెలిండా క్లార్క్ ఆట ఆమెను కట్టిపడేసింది.. క్రికెట్‌ను ప్రేమించేలా చేసింది. అంతే అప్పటికప్పుడు ఝులన్ నిర్ణయించేసుకుంది ఏది ఏమైనా తాను కూడా భారతదేశం తరపున ఆడాలని! కానీ తనుంటున్న చక్దా పల్లెటూరు. బడి అంటే ఓకే కానీ ఆటలను నేర్పించేంత సౌకర్యాలు తన ఊళ్లో లేవు. శిక్షణ కోసం కోల్‌కతా వెళ్లాల్సిందే. ఝులన్ నోటి వెంట ఆ మాట వినడమే ఆలస్యం ‘వద్దు’ అని చెప్పేశారు అమ్మా, నాన్న ముక్త కంఠంతో. ఆడపిల్లకు చదువుతో పాటు ఆట, పాట ఉండాలి అంటే ఏకంగా క్రికెట్‌కే గురి పెడతావా? పెళ్లికావాల్సిన పిల్లవి.. రేప్పొద్దున ఏదన్నా తేడా జరిగితే పెళ్లి అవుతుందా? అంటూ ఆందోళనా వ్యక్తం చేశారు. కాని దేశానికి స్వాతంత్య్రం సిద్ధించకముందు పుట్టిన ఝులన్ నానమ్మకు తెలుసు ఆడపిల్లకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ఎంత అవసరమో! అందుకే ‘ఆడపిల్లలు అన్నిట్లో ముందుండాలి. దేనికీ అధైర్యపడొద్దు. నచ్చిన పని చేయాలి’ అంటూ ఝులన్‌ను ప్రోత్సహించింది. ‘నాకు రెండేళ్లు టైమ్ ఇవ్వండి.. క్రికెట్లో ఝులన్‌ను స్టార్‌ను చేస్తా’ అంటూ కోచ్ స్వపన్ సాధు కూడా ఆమె కుటుంబాన్ని ఒప్పించాడు. ‘ఎంతో మంది ఆడ పిల్లలకు శిక్షణ నిచ్చా.. కాని నీలాగా హై ఆర్మ్ బౌలింగ్ చేసేవాళ్లను చూడలేదు. ఇంత టాలెంట్‌ని వృథా పోనివ్వను. క్రికెట్‌కే నిన్ను ఓ అసెట్‌లా తీర్చిదిద్దుతా’ అంటూ కోచ్‌గానే కాదు గైడ్, ఫిలాసఫర్‌గా ఆమెకు అండగా నిలిచాడు స్వపన్ సాధు. అలా ఝులన్ తన క్రికెట్ కలను నేరవేర్చుకోవడానికి.. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కోల్‌కతా ప్రయాణమైంది. 2007– 08 నుంచి ఆటగాళ్లకి ర్యాంకింగ్ సిస్టమ్ మొదలైంది. బౌలర్లలో ఝులన్ది నంబర్ వన్ ర్యాంక్. ఐసీసీ ఆమెకు గోల్డెన్ ఆర్మ్ బ్యాండ్‌ను బహుకరించింది. అలా కోచ్ ఊహించినట్టుగానే క్రికెట్ స్టార్ అయింది. ఓ ‘అద్భుతం’గా రికార్డ్ అయింది! ‘ప్రతిరోజూ ఉదయం ఏడున్నర కల్లా గ్రౌండ్లో ఉండాల్సిందే. లేకపోతే ఆరోజు ఆడనిచ్చేవాడు కాదు కోచ్. అందుకే పొద్దున్నే ఐదింటికల్లా సీల్దా నుంచి బాలిగంజ్ ట్రైన్లో బయలుదేరేదాన్ని. అందులో అందరూ స్పోర్ట్స్పర్సన్సే ఉండేవారు. అబ్బాయిలు, అమ్మాయిలం ఒక గ్రూప్‌గా బోల్డు కబుర్లు చెప్పుకుంటూ వెళ్లేవాళ్లం. పొరపాటున ట్రైన్ మిస్ అయితే జీవితంలో ఒకరోజు కోల్పోయిన ఫీల్ ఉండేది. ఏమైనా అవి బంగారు రోజులు’ అంటూ తన కోచింగ్ రోజులను గుర్తు చేసుకుంటుంది ఝులన్. ‘మా ఆటకు స్టేడియం ఖాళీగా ఉంటుంది. జనం కొట్టే జేజేలు, కేరింతలు లేకున్నా మా ఉత్సాహం ఏ మాత్రం తగ్గదు. నాకైతే ఎదురుగా బ్యాట్‌తో సిద్ధంగా ఉన్న ప్రత్యర్థి, స్టంప్స్ మాత్రమే కనిపించేవి. ప్రత్యర్థిని ఎలా ఔట్ చేయాలన్న ఏకైక లక్ష్యంతో దూసుకుపోయేదాన్ని’ అంటూ తన ఆట తీరును నెమరువేసుకుంటుంది ఝులన్. రిటైర్మెంట్ తర్వాత.. మ్యాచెస్లేని రోజులను ఊహించడం కష్టమే అయినా క్రికెట్ వల్ల వాయిదా పడ్డ పనులెన్నిటినో చేసుకోవడానికి కావల్సినంత సమయం దొరికింది అని తన మనసుకు నచ్చజెప్పుకుంటోంది ఝులన్. ‘ఇప్పుడిక దేనికీ ఏ రోక్టోక్ (ఆటంకం) లేదు. బిందాస్‌గా స్ట్రీట్ ఫుడ్ తింటా.. చక్కగా దుర్గా పూజను ఆస్వాదిస్తా’నంటూ తనేం చేయాలను కుందో చెప్పు కొచ్చింది. ‘2009 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ అయిపోవాలి అనుకున్నా. ఇప్పటికి ఆ నిర్ణయం తీసుకోగలిగా. ఇండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్లోకి వెళ్లడం, బౌలింగ్ చేయడం, నేషనల్ యాంథమ్ పాడటం వంటి అనుభూతులన్నిటినీ మిస్ అవుతాను’ అంటూ రిటైర్మెంట్ మిగిల్చే లోటునూ పంచుకుంది. ‘నా తొలి టెస్ట్ మ్యాచ్, తొలి వన్ డే మ్యాచ్, టీ20 డెబ్యూ కూడా ఇంగ్లండ్‌తోనే. చిత్రమేంటంటే నా ఆఖరి మ్యాచ్ కూడా ఇంగ్లండ్‌తోనే. బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలించిన చరిత్ర వింటూ పెరిగినందువల్లో ఏమో ఇంగ్లండ్ అంటే నాకు కోపం. ఆ సంగతి మా కెప్టెన్‌కీ తెలుసు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ అప్పుడు ‘నీ కసికొద్దీ బాల్ని కొట్టిరా’ అంటూ బౌలింగ్‌కు పంపించేది’ అని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ఝులన్. గ్రాఫ్ అండ్ గ్రేస్ 2007–ఐసిసి విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా గౌరవం పొందింది. (2008–2011)–విమెన్స్ క్రికెట్ కెప్టెన్ 204 మ్యాచుల్లో 255 వికెట్లతో అత్యధికంగా వికెట్లు తీసుకున్న ప్లేయర్‌గా నిలిచింది. 2010–అర్జున, 2012–పద్మశ్రీ అవార్డులను అందుకుంది. అనుష్క శర్మ నటిస్తున్న ఝులన్ బయోపిక్ చక్దా ఎక్స్‌ప్రెస్ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతోంది. ఆటకు అన్యాయం చేస్తానేమో అనే భయంతో పెళ్లి కూడా వద్దనుకుంది. కొన్ని ఫ్యాషన్ షోల్లోనూ పాల్గొంది. ఝులన్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. జె.. పాజీ.. బాబుల్ టీమ్‌లో నేనే వరస్ట్ డాన్సర్‌నని ఆట పట్టిస్తారంతా. నేను క్రికెటర్ని మరి.. డాన్సర్‌ని కాదుగా! టీమ్‌లో అల్లరిపిల్ల అంటే వేద. ఝులన్ దీదీ.. ఝులన్ దీ.. ఝులన్ నుంచి ఇప్పుడు జె అని పిలిచేవరకు వచ్చింది ఆ పిల్ల తీరు. ‘నా పేరుమొత్తం కట్ చేసేశావ్, నన్ను టీమ్ నుంచి బయటకు మాత్రం పంపకు’ అని జోక్ చేసేదాన్ని. హర్మన్ పూర్తిగా పంజాబీ యాక్సెంట్లోనే మాట్లాడుతుంటుంది. నాకొచ్చిన ఒకేఒక్క పంజాబీ పదం పాజీ. నేను తనని పాజీ అనేదాన్ని. అలా తను నాకు పాజీ అని పేరు పెట్టేసింది. చాలామంది బాబుల్ అని కూడా పిలుస్తారు. ఝులన్ గురించి మిథాలి.. ‘నాకు ఝులన్ అండర్ 19లో రాయ్ బరేలీలో ఆడినప్పటి నుంచి తెలుసు. అప్పుడు గ్రౌండ్ వెనుక ఉన్న హాస్టల్లో మాకు బస. నా గది కిటికీ నుంచి ఝులన్‌ను మొదటిసారి చూశా. బోరింగ్ పంప్ కొట్టి బకెట్లో నీళ్లు నింపి అక్కడే కూర్చుని బ్రష్ చేసుకుంటోంది. తన మొదటి బంతి క్యాచ్ చేయడం కూడా నాకు గుర్తు. చాలా కష్టపడి ఆడే అమ్మాయి. ప్రాక్టీస్ టైమ్‌లో కూడా తనతో పోటీ పడటం కష్టమే. ఎవరిలో లేని లక్షణం ఒకటి ఆమెలో ఉంది. మేం ఆటలో ఓడుతున్నా, గెలుస్తున్నా ఝులన్ ఏదో ఒక కార్నర్లో ఉండి టీమ్‌ని ఎంకరేజ్ చేస్తూ కనిపిస్తుంటుంది.’ గెలిచే వరకు.. పద్దెనిమిదేళ్ల పాటు నేను, మిథాలీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. వరల్డ్ కప్ గెలవలేకపోయాం. మన విమెన్ టీమ్ ప్రపంచ కప్ గెలవాలి. విమెన్ టీం ప్రపంచ కప్ గెలిస్తే చాలు. గెలిచే వరకు ఆ కలను కంటూనే ఉంటాను. -
నాటి టీమిండియా క్రికెటర్.. నేడు ఖగోళ శాస్త్రవేత్త
ముంబై: సాధారణంగా ఆటగాళ్లు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం వల్ల వారి విద్యాభ్యాసం సజావుగా సాగదు. క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన చాలా మంది క్రికెటర్లు చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే, ఇప్పుడు మనం చూపబోయే ఈ టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించి ఆస్ట్రోఫిజిస్ట్ అయ్యాడు. ఈ శతాబ్దపు ఆరంభంలో(2003) టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆవిష్కార్ సాల్వి.. తాజాగా ఆస్ట్రోఫిజిక్స్‌లో పీహెచ్డీ పూర్తి చేసి, క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తూ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యున్నత విద్యావంతుల జాబితాలో ముందువరుసలో నిలిచాడు. ఒకప్పటి టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకుని క్రికెట్ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు నాసా లేదా ఇస్రో వంటి సంస్థల్లో పని చేస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖగోళ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేయాలంటే అసాధారణమైన తెలివితేటలతో పాటు ఓర్పు, సహనం ఉండాలి. అయితే అంతరిక్ష అధ్యయనాలపై మక్కువతో తాను ఆస్ట్రో ఫిజిక్స్‌లో పీహెచ్డీ పూర్తి చేశానని సాల్వి చెప్పుకొచ్చాడు. కాగా, సాల్వి.. 2003లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను 2 వికెట్లు పడగొట్టాడు. అయితే కేవలం 4 వన్డేలు మాత్రమే ఆడిన సాల్వి.. తీవ్రమైన గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్లో కూడా పాల్గొన్నారు. 39 ఏళ్ల సాల్వి పదవీ విరమణ పొందిన అనంతరం క్రికెట్ కోచ్‌గా కూడా మారాడు. 2018లో పుదుచ్చేరి జట్టు కోచింగ్ స్టాఫ్‌లో ఒకరిగా పని చేశారు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన సాల్వి.. 50 ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో ఆడాడు. ఇదిలా ఉంటే, భారత మాజీ క్రికెటర్లలో కుంబ్లే, లక్ష్మణ్, అశ్విన్, ద్రవిడ్ లాంటి క్రికెటర్లు అత్యున్నత చదువులు చదువుకున్నారు. అయితే వారందరికంటే అత్యున్నత విద్యను అభ్యసించిన సాల్వి 'ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ క్రికెటర్'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చదవండి: వికెట్లను కాకుండా వ్యక్తులను టార్గెట్ చేయడమేంటి..? -
24 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన ప్రసిద్ద్ కృష్ణ
పూణే: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ(4/54) అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మంగళవారం ఎమ్సీఏ మైదానం వేదికగా జరిగిన తొలి వన్డేలో కృనాల్ పాండ్యాతో పాటు వన్డే క్యాప్‌ను అందుకున్న ఈ పాతికేళ్ల కర్ణాటక పేసర్.. మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో జేసన్ రాయ్ (46), ప్రమాదకర బెన్ స్టోక్స్ (1)ను ఔట్ చేసి ఇంగ్లండ్ పతనాన్ని ప్రారంభించి, ఆతరువాత మిడిల్ ఓవర్లలో సామ్ బిల్లింగ్స్ (18), టామ్ కర్రన్ (11) వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమిని ఖరారు చేశాడు. మొత్తం 8.1 ఓవర్లు బౌల్ చేసిన ఆయన.. 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతను వన్డే అరంగేట్రంలో ఏ భారత బౌలర్‌కు సాధ్యపడని నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు. గతంలో వన్డే అరంగేట్రంలో భారత బౌలర్లు నోయల్ డేవిడ్ (3/21), వరుణ్ అరోణ్ (3/24), హార్దిక్ పాండ్యా (3/31), పీయూస్ చావ్లా (3/37)లు మూడు వికెట్ల ప్రదర్శన చేయగా తాజాగా ప్రసిద్ద్ కృష్ణ ఆ నలుగురు బౌలర్లను వెనక్కునెట్టి నాలుగు వికెట్లు ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. వీరిలో స్పిన్నర్ నోయల్ డేవిడ్ 1997లో వెస్టిండీస్‌పై చేసిన ప్రదర్శన ఇప్పటి వరకు టాప్‌లో ఉండింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ప్రసిద్ద్ కృష్ణ ఆ రికార్డును సవరించి 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఇదే వేదికగా రెండో వన్డే జరుగనుంది. చదవండి: అదరగొట్టిన అరంగేట్రం ఆటగాళ్లు.. టీమిండియాదే తొలి వన్డే -
ఇషాంత్ శర్మ శతకం
సుమారు 13 సంవత్సరాల క్రితం... 19 ఏళ్ల కుర్రాడొకడు పేస్‌కు స్వర్గధామంలాంటి పెర్త్ పిచ్‌పై ప్రపంచ టాప్ బ్యాట్స్‌మన్ రికీ పాంటింగ్‌ను గడగడలాడించాడు. ఏడు ఓవర్ల స్పెల్‌లో దాదాపు ప్రతీ బంతికి పాంటింగ్ తడబడ్డాడు. ఎంతో మంది దిగ్గజ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఆసీస్ కెప్టెన్, కేవలం నాలుగో మ్యాచ్ ఆడుతున్న ఆ పేసర్ బంతులను ఎలా ఆడాలో అర్థం కాని గందరగోళంలో పడి చివరకు స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పుడే క్రికెట్ వ్యాఖ్యాతలంతా ఈ మ్యాచ్ లేదా సిరీస్ ఫలితం ఏమైనా కానీ... ఈ అద్భుత స్పెల్ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుందని, ఆ పేసర్ కెరీర్లో ఎంతో ఎదుగుతాడని వ్యాఖ్యానించారు. నిజంగా అదే జరిగింది. ఆ స్పెల్ వేసిన ఇషాంత్ శర్మ స్థాయిని అమాంతం పెంచేసింది. ఆపై ఎన్నో ఆటుపోట్లను తట్టుకొన్న అతను భారత్ తరఫున అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదిగాడు. తనతో పోటీ పడిన ఎందరికో సాధ్యంకాని రీతిలో 100 టెస్టుల మైలురాయిని ఇంగ్లండ్‌తో బుధవారం అహ్మదాబాద్‌లో మొదలయ్యే మూడో టెస్టులో చేరుకోబోతున్నాడు. సాక్షి క్రీడా విభాగం: ఇషాంత్ శర్మ 2011లో మొదటిసారి తన కెరీర్ లక్ష్యాల్లో 100 టెస్టులు ఆడటం ఒకటని చెప్పుకున్నాడు. అప్పటికి అతను ఇంకా 40 టెస్టులు కూడా పూర్తి చేసుకోలేదు. ఆపై వరుస గాయాలు, ఫామ్ కోల్పోవడం, కొత్త పేస్ బౌలర్ల రాక... ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయినాసరే మరో దశాబ్ద కాలపు కెరీర్‌ను కొనసాగించగలగడం ఒక ఫాస్ట్ బౌలర్ కోణంలో చూస్తే సాధారణ విషయం కాదు. తన మార్గదర్శి జహీర్ ఖాన్ 92 టెస్టులతో ఆగిపోయిన చోట... ఇషాంత్ మాత్రం అతడిని దాటి వంద వరకు రాగలిగాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, హై ఆర్మ్ యాక్షన్, అసలైన ఫాస్ట్ బౌలర్ లక్షణాలతో కెరీర్ ప్రారంభించిన ‘లంబూ’ భారత జట్టు సాధించిన అనేక చిరస్మరణీయ విజయాల్లో భాగంగా నిలిచాడు. దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ (131 టెస్టులు) తర్వాత వంద మ్యాచ్‌లు ఆడిన భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలవడం అంటేనే ఇషాంత్ ఘనత ప్రత్యేకత ఏమిటో అర్థమవుతుంది. ఘనారంభం... తన రెండో టెస్టు మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇషాంత్ కెరీర్ జోరుగానే ప్రారంభమైంది. ‘పెర్త్–పాంటింగ్’ మెరుపు బౌలింగ్ తర్వాత ధోని టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే అతను మరోసారి ఐదు వికెట్లు తీసి కెప్టెన్ ఫేవరెట్‌గా మారాడు. ఆపై కొద్ది రోజులకే స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కూడా 15 వికెట్లతో సత్తా చాటాడు. అయితే జట్టులో రెండో ప్రధాన పేసర్‌గా జహీర్‌తో కూడా జట్టుకు కీలక విజయాలు అందిస్తున్న సమయంలో ఇషాంత్ బౌలింగ్ లయ తప్పింది. అప్పటి వరకు అతని బలమైన పేస్ బలహీనతగా మారిపోయింది. దాదాపు 150కు పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం నుంచి 130ల్లోకి పడిపోయాడు. ఫలితంగా ప్రత్యర్థుల దృష్టిలో సాధారణ బౌలర్‌గా మారిపోవడంతో ఒకవైపు వికెట్లు రాకపోగా, మరోవైపు సాధారణ బౌలర్ తరహాలో టెస్టుల్లో కూడా భారీగా పరుగులు సమర్పించుకున్న పరిస్థితి. ముఖ్యంగా 2012 ఆస్ట్రేలియా పర్యటన అతని కెరీర్లో చేదు జ్ఞాపకంగా మిగిపోయింది. నాలుగు టెస్టుల్లో కలిపి ఐదంటే ఐదే వికెట్లు తీసి గత సిరీస్‌లో హీరోగా మారిన చోట జీరోలా కనిపించాడు. ఏదోలా 50 టెస్టులు పూర్తి చేసుకున్నా... కనీసం 50 టెస్టులు ఆడిన బౌలర్లలో అందరికంటే చెత్త బౌలింగ్ సగటు ఇషాంత్‌దే కనిపించింది. మళ్లీ సత్తా చాటి... కెరీర్ ప్రమాదంలో పడిన దశలో ఇషాంత్ దానిని చక్కదిద్దుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. ముఖ్యంగా తనను ఇబ్బంది పెడుతున్న ఫిట్నెస్ సమస్యపై దృష్టి పెట్టాడు. పైగా పరిమిత ఓవర్లకు దాదాపుగా గుడ్‌బై చెప్పి పూర్తిగా ఎరుపు బంతిపైనే దృష్టి పెట్టాడు. దాంతో సహజంగానే ఫలితాలు వచ్చాయి. 2014 న్యూజిలాండ్ పర్యటన అతడికి మేలిమలుపు. రెండు టెస్టుల్లోనే 15 వికెట్లు తీసిన ఇషాంత్ బౌలింగ్‌లో పదును పెరిగిందని అందరికీ అర్థమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌పై 74 పరుగులకే 7 వికెట్లు పడగొట్టిన ప్రదర్శన అతని కెరీర్లో హైలైట్‌గా నిలిచింది. అతని బౌలింగ్ వల్లే ఈ సిరీస్‌లో భారత్ తన ఏకైక టెస్టును గెలవగలిగింది. ఆ తర్వాత ఇషాంత్ మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే కీలక సమయాల్లో కొంత అదృష్టం కూడా అతనికి కలిసొచ్చింది. ఇప్పుడున్న తరహాలో టీమిండియా పేస్ బౌలింగ్ దళంలో ఎక్కువ ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేకపోవడంతో కొన్నిసార్లు వైఫల్యాలు వచ్చినా... సీనియర్ హోదాలో ఇషాంత్ అనేక టెస్టులు ఆడగలిగాడు. మరింత మెరుగవుతూ... గత కొన్నేళ్లలో ఇషాంత్ కెరీర్ గణాంకాలు మరింత అద్భుతంగా కనిపిస్తాయి. ససెక్స్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడినప్పుడు ఆస్ట్రేలియా మాజీ పేసర్ జేసన్ గిలెస్పీ ఇచ్చిన సూచనలు ఇషాంత్ ఆటను రాటుదేల్చాయి. 2018 నుంచి చూస్తే కమిన్స్, అండర్సన్లకంటే మెరుగ్గా ఇషాంత్ సగటు అద్భుత రీతిలో 19.34 మాత్రమే ఉందంటే అతను ఎంతగా చెలరేగిపోతున్నాడో అర్థమవుతుంది. సుదీర్ఘ కెరీర్లో పలు ప్రతికూలతలు అధిగమించి కృషి, పట్టుదల, సంకల్పంతో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా ఎదిగిన ఇషాంత్ శర్మ వంద టెస్టులు ఆడటం పేసర్లకు స్ఫూర్తినిచ్చే, గర్వపడే క్షణం అనడంలో సందేహం లేదు. -
భారత్-లంక రెండో వన్డే; మరో విశేషం
పల్లెకెలె: శ్రీలంకతో గురువారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ బ్యాట్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. 131 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను సమయోచిత బ్యాటింగ్‌తో గెలుపు బాట పట్టించాడు. 'మిస్టర్ కూల్' మహేంద్ర సింగ్ ధోనితో కలిసి 100 పరుగులు అభేద్య భాగస్వామ్యం నమోదు చేసిన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో వన్డేల్లో ఎనిమిదో వికెట్‌కు భారత్ తరపున అత్యధిక భాగస్వామ్యం(100) నెలకొల్పిన జోడిగా ధోని-భువి రికార్డు సృష్టించారు. వన్డేల్లో తొలి అర్థసెంచరీని మరపురాని జ్ఞాపకంగా మలుచుకున్నాడు. భువనేశ్వర్ 80 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 53 చేశాడు. ధోని 68 బంతుల్లో కేవల ఒక ఫోర్‌తో 45 పరుగులు సాధించాడు. భువీ ఇన్నింగ్స్‌లో మరో విశేషం కూడా ఉంది. ముందుగా 10 ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చిన భువీ, బ్యాటింగ్‌లో కరెక్టుగా అన్నే పరుగులు చేయడం విశేషం. బౌలింగ్‌లో ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయిన భువీ.. బ్యాట్‌తో దుమ్మురేపాడు. -
కొత్త బుల్లెట్..
►భారత పేస్ బౌలింగ్ ఆశాకిరణం నాథూ సింగ్ ► పేదరికం దాటి ప్లే గ్రౌండ్లోకి ► ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ల నుంచి ప్రశంసలు ఫాస్ట్ బౌలింగ్ అతనికి సహజసిద్ధంగా అబ్బింది. వేగం గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన పని లేదు...దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ చెప్పిన మాట. ఈ కుర్రాడిలో చాలా ప్రతిభ ఉంది. జాగ్రత్తగా కాపాడుకుంటే గొప్ప ఫాస్ట్ బౌలర్ కాగలడు... రాజస్థాన్ క్రికెట్‌కు రాహుల్ ద్రవిడ్ సూచన. చాలా రోజుల తర్వాత భారత్‌లో అసలైన పేస్ బౌలింగ్ చూస్తున్నా. ఆ వేగం అసాధారణం... అతని బౌలింగ్‌లో అవుటయ్యాక గౌతమ్ గంభీర్ స్పందన. గణాంకాలతోనే ఆటగాళ్లను ఎంపిక చేస్తే సెలక్టర్లు ఎందుకు. ప్రతిభను గుర్తించడం కూడా మా పని. నాలుగే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల తర్వాత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు ఎంపిక చేసిన అనంతరం చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ వివరణ. ఇదంతా 20 ఏళ్ల రాజస్థాన్ బౌలర్ నాథూ సింగ్‌పై కురుస్తున్న ప్రశంసల వర్షం. అసలు ఆ కుర్రాడిలో అంతగా ఏముంది? ‘అమ్మా నాన్న’ పచ్చబొట్టు ఈతరం కుర్ర క్రికెటర్లలో చాలా మందికి టాటూస్ సరదా ఉండటం సహజం. వింత వింత బొమ్మలతో పాటు ఏవో కొటేషన్లు చేతులు, భుజాలంతా పరచుకుంటాయి. కానీ ఎంత మంది 20 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ స్థాయి క్రికెటర్లు ‘అమ్మా నాన్న’ అంటూ పచ్చబొట్టు పొడిపించుకుంటారు? అలా చేసేవాడు ఏదో పాతకాలం వాడిలాగా కనిపిస్తాడు. కానీ పేదరికంలో పుట్టి పెరిగిన ఆ క్రికెటర్ తన తల్లిదండ్రులు తన కోసం పడిన శ్రమను, సర్వస్వాన్ని పణంగా పెట్టడాన్ని అనుక్షణం గుర్తు తెచ్చుకునేందుకు అలా చేశాడు. సాక్షి, హైదరాబాద్: ఇటీవల చిన్న పట్టణాల నుంచి కూడా భారత క్రికెట్లోకి ఆటగాళ్లు వస్తున్నారనే మాట తరచుగా వినిపిస్తోంది. కానీ అవి చిన్న పట్టణాలు కావచ్చు. కానీ వారిలో చాలా మంది చిన్నవారేమీ కాదు. మంచి నేపథ్యం ఉన్నవారే. కానీ జైపూర్‌కు చెందిన నాథూ సింగ్ మాత్రం పేదరికానికి చిరునామాలాగే పెరిగాడు. అయితే అది అతని ప్రతిభను అడ్డుకోలేదు. ఇప్పుడు భారత్‌లో అత్యంత వేగంగా బంతులు విసురుతున్న బౌలర్‌గా నాథూ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతను వేసే ఏ బంతీ కూడా 140 కిలోమీటర్ల వేగానికి తగ్గడం లేదు. లెదర్ బంతితో బౌలింగ్ ప్రారంభించిన మూడేళ్ల లోపే రాజస్థాన్ సీనియర్ జట్టులోకి వచ్చిన నాథూ సింగ్... తన తొలి రంజీ ట్రోఫీ సీజన్లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తండ్రి కష్టార్జితంతో... నాథూ తండ్రి భరత్ సింగ్ వైర్ల ఫ్యాక్టరీలో లేబర్. మూడేళ్ల క్రితం వరకు కూడా నాథూ మదిలో సీరియస్ క్రికెట్ ఆలోచనే రాలేదు. 17 ఏళ్ల వయసు వచ్చింది కాబట్టి కొద్ది రోజుల్లో ఏదో ఒక ఫ్యాక్టరీలో లేబర్‌గా చేరిపోదామని సిద్ధమైపోయాడు. టెన్నిస్ బాల్‌తో వేగంగా బౌలిం గ్ చేయడమే అతనికి తెలుసు. కానీ కొందరు మిత్రులకు అది కూడా చాలా వేగంగా అనిపించి ప్రోత్సహించారు. కోచింగ్ అకాడమీలో చేరేం దుకు తండ్రి వద్ద అప్పటివరకు ఉన్న మొత్తం పొదుపు రూ. 10 వేలు పెట్టేశారు. జిల్లా స్థాయి టోర్నీల్లో సంచలన ప్రదర్శనతో ఏడాది తిరిగే లోపు రాజస్థాన్ అండర్-19 జట్టులోకి వచ్చేశాడు. ‘ఆ రోజు నాకు బాగా గుర్తు. నేను తప్పు చేస్తున్నానేమో, అనవసరంగా అమ్మా నాన్నని ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించింది. కానీ దేవుడు అండగా నిలిచాడు. ఆరంభంలో డబ్బులు లేక బాగా ఇబ్బంది పడ్డాను. రాజస్థాన్ సీనియర్ బౌలర్లు దీపక్ చహర్, అనికేత్ చౌదరి తమ షూస్, స్పైక్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. మొదటి మ్యాచ్ ఫీజు అమ్మానాన్నలకు ఇచ్చిన రోజు వారి కళ్లలో ఎంతో ఆనందం కనిపిం చింది’ అని హైదరాబాద్‌లో విజయ్ హజారే టోర్నీ ఆడేం దుకు వచ్చిన నాథూ ఉద్వేగంగా చెప్పుకున్నాడు. రంజీ ట్రోఫీలోకి... అండర్-19 ప్రదర్శనతో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడి కోచ్ సెంథిల్ పర్యవేక్షణలో నాథూ వేగం మరింత పెరిగింది. ఇక్కడే చీఫ్ కోచ్ గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)ను తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో వెంకటేశ్ ప్రసాద్ సూచనలు కూడా పనికొచ్చాయి. వేగంతో పాటు కచ్చితత్వం కూడా పెరుగుతూ వచ్చింది. ఫలితంగా తొలిసారి రంజీ ట్రోఫీ ఆడే అవకాశం కలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ దిశగా సాగుతున్న గంభీర్... నాథూ అద్భుతమైన బంతికి ఎల్బీగా వెనుదిరగడంతో ఒక్కసారిగా నివ్వెరపోయాడు. ఆ ఇన్నింగ్స్‌లో మొత్తం 7 వికెట్లు పడగొట్టిన అతనికి మరో మూడు మ్యాచ్‌ల తర్వాత దక్షిణాఫ్రికాకు బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. ‘ఇంత తొందరగా ఆమ్లా, డివిలియర్స్‌లకు బౌలింగ్ చేస్తానని అనుకోలేదు. చాలా సార్లు చక్కటి బంతులతో వారిని ఇబ్బంది పెట్టగలిగాను’ అని ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. ఇన్‌స్వింగ్ స్పెషల్... మెక్‌గ్రాత్ విశ్లేషించినట్లు నాథూ సింగ్‌లో పేస్, స్వింగ్ సహజ సిద్ధంగా వచ్చాయి. ‘నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఎలా బౌలింగ్ వేసేవాడినో ఇప్పుడూ అలాగే వేస్తున్నాను. పిచ్‌ను బట్టి లెంగ్త్‌ను మార్చుకుంటానంతే. బంతిని స్వింగ్ చేసేందుకు, కట్ చేసేందుకు నేను ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయలేదు. ఇవన్నీ టెన్నిస్ బాల్‌తో నేను స్వయంగా నేర్చుకున్నవే. నాకు నేను ఇన్‌స్వింగ్ బౌలర్‌గా భావిస్తా’ అని నాథూ అంటున్నాడు. నాథూ గొప్పతనం ఒక మ్యాచ్‌కో, సెషన్‌కో పరిమితం కాలేదు. అతనిలో సహజ సిద్ధమైన వేగం ఉంది. 70 ఓవర్ల తర్వాత పాతబడిన బంతితోనూ... ఒక రోజులో తన 18వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా అదే వేగం కొనసాగిస్తున్నాడు. బీసీసీఐ వ్యవస్థ ద్వారా కాకుండా సొంతంగా శ్రమించి వెలుగులోకి వచ్చిన ఒక యువ క్రికెటర్ భవిష్యత్తులో కూడా ఇలాగే సత్తా చాటాలని ఆశిద్దాం. ఆరంభంలో వేగంగా వేసి తర్వాత మీడియం పేస్‌గా మారిన చాలా మంది బౌలర్లలాగా నేనూ కావొద్దని అంతా చెబుతున్నారు. అలా అని నాపై ఒత్తిడి ఏమీ లేదు. ఇకపై కూడా వేగం పెరుగుతుందే తప్ప తగ్గదు. నేను అతిగా ఏదీ ఆశించడం లేదు. ఇప్పటి వరకు నా వద్దకు ఏది వస్తే దానినే అందుకున్నాను. రంజీల్లో అవకాశం కూడా అలాంటిదే. ఇప్పుడే భారత్‌కు ఆడటంలాంటి పెద్ద పెద్ద లక్ష్యాలేమీ పెట్టుకోలేదు. ఫాస్ట్ బౌలర్‌ను అనిపించుకునేందుకు, కండలు పెంచుకునే జిమ్‌కు వెళ్లి భారీ ఎక్సర్సైజ్లు కూడా అసలు ఏమీ చేయను. స్పీడ్ గన్లను కూడా చూస్తూ కూర్చోను. ఎవరో చెబితేనే నా వేగం ఎంత అనేది తెలిసింది. నాకు తెలిసిందల్లా మైదానంలోకి దిగిన తర్వాత సాధ్యమైనంత వేగంగా బంతిని విసరడం. ఎన్నో ఏళ్లుగా అదే చేస్తున్నాను. దీని కోసం ప్రత్యేక సలహాలు తీసుకోలేదు. ఏ పేస్ బౌలర్‌నూ ఎలా వేయాలని అడగలేదు. నేను ఆదర్శంగా భావించే ఫాస్ట్ బౌలర్ అంటూ ఎవరూ లేరు. పేదరికాన్ని అనుభవించిన నేను ఈ స్థాయికి రావడమే గొప్ప. ఎంతో మంది సహకారం వల్లే ఇది సాధ్యమైంది. -‘సాక్షి’తో నాథూ సింగ్, ఫాస్ట్ బౌలర్