
వన్డే అరంగేట్రంలో ఏ భారత బౌలర్‌కు సాధ్యపడని నాలుగు వికెట్ల ఘనతను ప్రసిద్ద్ కృష్ణ(4/54) సాధించాడు.
పూణే: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ(4/54) అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మంగళవారం ఎమ్‌సీఏ మైదానం వేదికగా జరిగిన తొలి వన్డేలో కృనాల్ పాండ్యాతో పాటు వన్డే క్యాప్‌ను అందుకున్న ఈ పాతికేళ్ల కర్ణాటక పేసర్.. మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో జేసన్ రాయ్ (46), ప్రమాదకర బెన్ స్టోక్స్ (1)ను ఔట్ చేసి ఇంగ్లండ్ పతనాన్ని ప్రారంభించి, ఆతరువాత మిడిల్ ఓవర్లలో సామ్ బిల్లింగ్స్ (18), టామ్ కర్రన్ (11) వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమిని ఖరారు చేశాడు. మొత్తం 8.1 ఓవర్లు బౌల్ చేసిన ఆయన.. 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతను వన్డే అరంగేట్రంలో ఏ భారత బౌలర్‌కు సాధ్యపడని నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు.
గతంలో వన్డే అరంగేట్రంలో భారత బౌలర్లు నోయల్ డేవిడ్ (3/21), వరుణ్ అరోణ్ (3/24), హార్దిక్ పాండ్యా (3/31), పీయూస్ చావ్లా (3/37)లు మూడు వికెట్ల ప్రదర్శన చేయగా తాజాగా ప్రసిద్ద్ కృష్ణ ఆ నలుగురు బౌలర్లను వెనక్కునెట్టి నాలుగు వికెట్లు ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. వీరిలో స్పిన్నర్ నోయల్ డేవిడ్ 1997లో వెస్టిండీస్‌పై చేసిన ప్రదర్శన ఇప్పటి వరకు టాప్‌లో ఉండింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ప్రసిద్ద్ కృష్ణ ఆ రికార్డును సవరించి 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఇదే వేదికగా రెండో వన్డే జరుగనుంది.
చదవండి: అదరగొట్టిన అరంగేట్రం ఆటగాళ్లు.. టీమిండియాదే తొలి వన్డే