కొత్త బుల్లెట్.. | indian new face bowler nathu singh interview | Sakshi
Sakshi News home page

కొత్త బుల్లెట్..

Published Sun, Dec 13 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

కొత్త బుల్లెట్..

కొత్త బుల్లెట్..

భారత పేస్ బౌలింగ్ ఆశాకిరణం నాథూ సింగ్
  పేదరికం దాటి ప్లే గ్రౌండ్‌లోకి  
  ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ల నుంచి ప్రశంసలు

ఫాస్ట్ బౌలింగ్ అతనికి సహజసిద్ధంగా అబ్బింది. వేగం గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన పని లేదు...దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ చెప్పిన మాట.

ఈ కుర్రాడిలో చాలా ప్రతిభ ఉంది. జాగ్రత్తగా కాపాడుకుంటే గొప్ప ఫాస్ట్ బౌలర్ కాగలడు... రాజస్థాన్ క్రికెట్‌కు రాహుల్ ద్రవిడ్ సూచన.

చాలా రోజుల తర్వాత భారత్‌లో అసలైన పేస్ బౌలింగ్ చూస్తున్నా. ఆ వేగం అసాధారణం... అతని బౌలింగ్‌లో అవుటయ్యాక గౌతమ్ గంభీర్ స్పందన.


గణాంకాలతోనే ఆటగాళ్లను ఎంపిక చేస్తే సెలక్టర్లు ఎందుకు. ప్రతిభను గుర్తించడం కూడా మా పని. నాలుగే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల తర్వాత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు ఎంపిక చేసిన అనంతరం చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ వివరణ. ఇదంతా 20 ఏళ్ల రాజస్థాన్ బౌలర్ నాథూ సింగ్‌పై కురుస్తున్న ప్రశంసల వర్షం. అసలు ఆ కుర్రాడిలో అంతగా ఏముంది?
 
 ‘అమ్మా నాన్న’ పచ్చబొట్టు
 ఈతరం కుర్ర క్రికెటర్లలో చాలా మందికి టాటూస్ సరదా ఉండటం సహజం. వింత వింత బొమ్మలతో పాటు ఏవో కొటేషన్లు చేతులు, భుజాలంతా పరచుకుంటాయి. కానీ ఎంత మంది 20 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ స్థాయి క్రికెటర్లు ‘అమ్మా నాన్న’ అంటూ పచ్చబొట్టు పొడిపించుకుంటారు? అలా చేసేవాడు ఏదో పాతకాలం వాడిలాగా కనిపిస్తాడు. కానీ పేదరికంలో పుట్టి పెరిగిన ఆ క్రికెటర్ తన తల్లిదండ్రులు తన కోసం పడిన శ్రమను, సర్వస్వాన్ని పణంగా పెట్టడాన్ని అనుక్షణం గుర్తు తెచ్చుకునేందుకు అలా చేశాడు.
 
 సాక్షి, హైదరాబాద్: ఇటీవల చిన్న పట్టణాల నుంచి కూడా భారత క్రికెట్‌లోకి ఆటగాళ్లు వస్తున్నారనే మాట తరచుగా వినిపిస్తోంది. కానీ అవి చిన్న పట్టణాలు కావచ్చు. కానీ వారిలో చాలా మంది చిన్నవారేమీ కాదు. మంచి నేపథ్యం ఉన్నవారే. కానీ జైపూర్‌కు చెందిన నాథూ సింగ్ మాత్రం పేదరికానికి చిరునామాలాగే పెరిగాడు. అయితే అది అతని ప్రతిభను అడ్డుకోలేదు. ఇప్పుడు భారత్‌లో అత్యంత వేగంగా బంతులు విసురుతున్న బౌలర్‌గా నాథూ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతను వేసే ఏ బంతీ కూడా 140 కిలోమీటర్ల వేగానికి తగ్గడం లేదు. లెదర్ బంతితో బౌలింగ్ ప్రారంభించిన మూడేళ్ల లోపే రాజస్థాన్ సీనియర్ జట్టులోకి వచ్చిన నాథూ సింగ్... తన తొలి రంజీ ట్రోఫీ సీజన్‌లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.
 
 తండ్రి కష్టార్జితంతో...
 నాథూ తండ్రి భరత్ సింగ్ వైర్ల ఫ్యాక్టరీలో లేబర్. మూడేళ్ల క్రితం వరకు కూడా నాథూ మదిలో సీరియస్ క్రికెట్ ఆలోచనే రాలేదు. 17 ఏళ్ల వయసు వచ్చింది కాబట్టి కొద్ది రోజుల్లో ఏదో ఒక ఫ్యాక్టరీలో లేబర్‌గా చేరిపోదామని సిద్ధమైపోయాడు. టెన్నిస్ బాల్‌తో వేగంగా బౌలిం గ్ చేయడమే అతనికి తెలుసు. కానీ కొందరు మిత్రులకు అది కూడా చాలా వేగంగా అనిపించి ప్రోత్సహించారు. కోచింగ్ అకాడమీలో చేరేం దుకు తండ్రి వద్ద అప్పటివరకు ఉన్న మొత్తం పొదుపు రూ. 10 వేలు పెట్టేశారు.
 
 జిల్లా స్థాయి టోర్నీల్లో సంచలన ప్రదర్శనతో ఏడాది తిరిగే లోపు రాజస్థాన్ అండర్-19 జట్టులోకి వచ్చేశాడు. ‘ఆ రోజు నాకు బాగా గుర్తు. నేను తప్పు చేస్తున్నానేమో, అనవసరంగా అమ్మా నాన్నని ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించింది. కానీ దేవుడు అండగా నిలిచాడు.  ఆరంభంలో డబ్బులు లేక బాగా ఇబ్బంది పడ్డాను. రాజస్థాన్ సీనియర్ బౌలర్లు దీపక్ చహర్, అనికేత్ చౌదరి తమ షూస్, స్పైక్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. మొదటి మ్యాచ్ ఫీజు అమ్మానాన్నలకు ఇచ్చిన రోజు వారి కళ్లలో ఎంతో ఆనందం కనిపిం చింది’ అని హైదరాబాద్‌లో విజయ్ హజారే టోర్నీ ఆడేం దుకు వచ్చిన నాథూ ఉద్వేగంగా చెప్పుకున్నాడు.
 
 రంజీ ట్రోఫీలోకి...
 అండర్-19 ప్రదర్శనతో ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడి కోచ్ సెంథిల్ పర్యవేక్షణలో నాథూ వేగం మరింత పెరిగింది. ఇక్కడే చీఫ్ కోచ్ గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)ను తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో వెంకటేశ్ ప్రసాద్ సూచనలు కూడా పనికొచ్చాయి. వేగంతో పాటు కచ్చితత్వం కూడా పెరుగుతూ వచ్చింది. ఫలితంగా తొలిసారి రంజీ ట్రోఫీ ఆడే అవకాశం కలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ దిశగా సాగుతున్న గంభీర్... నాథూ అద్భుతమైన బంతికి ఎల్బీగా వెనుదిరగడంతో ఒక్కసారిగా నివ్వెరపోయాడు.
 
  ఆ ఇన్నింగ్స్‌లో మొత్తం 7 వికెట్లు పడగొట్టిన అతనికి మరో మూడు మ్యాచ్‌ల తర్వాత దక్షిణాఫ్రికాకు బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. ‘ఇంత తొందరగా ఆమ్లా, డివిలియర్స్‌లకు బౌలింగ్ చేస్తానని అనుకోలేదు. చాలా సార్లు చక్కటి బంతులతో వారిని ఇబ్బంది పెట్టగలిగాను’ అని ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.
 
 ఇన్‌స్వింగ్ స్పెషల్...
 మెక్‌గ్రాత్ విశ్లేషించినట్లు నాథూ సింగ్‌లో పేస్, స్వింగ్ సహజ సిద్ధంగా వచ్చాయి. ‘నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఎలా బౌలింగ్ వేసేవాడినో ఇప్పుడూ అలాగే వేస్తున్నాను. పిచ్‌ను బట్టి లెంగ్త్‌ను మార్చుకుంటానంతే. బంతిని స్వింగ్ చేసేందుకు, కట్ చేసేందుకు నేను ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయలేదు. ఇవన్నీ టెన్నిస్ బాల్‌తో నేను స్వయంగా నేర్చుకున్నవే.
 
 నాకు నేను ఇన్‌స్వింగ్ బౌలర్‌గా భావిస్తా’ అని నాథూ అంటున్నాడు. నాథూ గొప్పతనం ఒక మ్యాచ్‌కో, సెషన్‌కో పరిమితం కాలేదు. అతనిలో సహజ సిద్ధమైన వేగం ఉంది. 70 ఓవర్ల తర్వాత పాతబడిన బంతితోనూ... ఒక రోజులో తన 18వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా అదే వేగం కొనసాగిస్తున్నాడు. బీసీసీఐ వ్యవస్థ ద్వారా కాకుండా సొంతంగా శ్రమించి వెలుగులోకి వచ్చిన ఒక యువ క్రికెటర్ భవిష్యత్తులో కూడా ఇలాగే సత్తా చాటాలని ఆశిద్దాం.
 
 ఆరంభంలో వేగంగా వేసి తర్వాత మీడియం పేస్‌గా మారిన చాలా మంది బౌలర్లలాగా నేనూ కావొద్దని అంతా చెబుతున్నారు. అలా అని నాపై ఒత్తిడి ఏమీ లేదు. ఇకపై కూడా వేగం పెరుగుతుందే తప్ప తగ్గదు. నేను అతిగా ఏదీ ఆశించడం లేదు. ఇప్పటి వరకు నా వద్దకు ఏది వస్తే దానినే అందుకున్నాను. రంజీల్లో అవకాశం కూడా అలాంటిదే. ఇప్పుడే భారత్‌కు ఆడటంలాంటి పెద్ద పెద్ద లక్ష్యాలేమీ పెట్టుకోలేదు. ఫాస్ట్ బౌలర్‌ను అనిపించుకునేందుకు, కండలు పెంచుకునే జిమ్‌కు వెళ్లి భారీ ఎక్సర్‌సైజ్‌లు కూడా అసలు ఏమీ చేయను. స్పీడ్ గన్‌లను కూడా చూస్తూ కూర్చోను.
 
 ఎవరో చెబితేనే నా వేగం ఎంత అనేది తెలిసింది. నాకు తెలిసిందల్లా మైదానంలోకి దిగిన తర్వాత సాధ్యమైనంత వేగంగా బంతిని విసరడం. ఎన్నో ఏళ్లుగా అదే చేస్తున్నాను. దీని కోసం ప్రత్యేక సలహాలు తీసుకోలేదు. ఏ పేస్ బౌలర్‌నూ ఎలా వేయాలని అడగలేదు. నేను ఆదర్శంగా భావించే ఫాస్ట్ బౌలర్ అంటూ ఎవరూ లేరు. పేదరికాన్ని అనుభవించిన నేను ఈ స్థాయికి రావడమే గొప్ప. ఎంతో మంది సహకారం వల్లే ఇది సాధ్యమైంది.
   -‘సాక్షి’తో నాథూ సింగ్, ఫాస్ట్ బౌలర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement