
సానియా ‘ఖేల్ రత్న’కు మార్గం సుగమం
నేడు జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న’ అవార్డు విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కాస్త ఊరట లభించింది. మొదట ప్రకటించినట్లుగానే సానియాకు ‘ఖేల్ రత్న’ను అందజేయాలని కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన నోటీసులు అవార్డు ఇవ్వడానికి అడ్డంకిగా మారబోవని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అవార్డుల కార్యక్రమంలో మొదట ఎంపిక చేసిన జాబితాను అమలు చేస్తామన్నారు. మరోవైపు సానియా గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధారణ విభాగంలో పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. నాలుగేళ్ల కాల వ్యవధితో పాటు అవార్డు ఇచ్చే ఏడాది... ఏ క్రీడాకారుడైనా అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే ఖేల్త్న్రతో గౌరవించొచ్చని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం నేడు రాష్ట్రపతి భవన్‌లో జరుగుతుంది.
వినోద్ కుమార్‌కూ ఇవ్వండి...
మరోవైపు భారత రెజ్లింగ్ మాజీ చీఫ్ కోచ్ వినోద్ కుమార్‌కు కూడా ‘ద్రోణాచార్య పురస్కారం’ అందించాలని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2012లోనే వినోద్‌కు ‘ధ్యాన్‌చంద్ అవార్డు’ ఇచ్చినందున ఆయన పేరును ద్రోణాచార్యకు పరిశీలించలేమంటూ కేంద్రం, మాజీ కోచ్ పేరును పక్కన పెట్టింది. అయితే తనకు నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నాయని, గత అవార్డు దీనికి అడ్డంకి కాదంటూ వినోద్ కోర్టుకెక్కారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు వినోద్ సాధించిన విజయాలు, ఘనతలను సెలక్షన్ కమిటీ పరిశీలనలోకి తీసుకోవాలంటూ తీర్పు చెప్పింది.