ఒంటారియో: షాహిద్ ఆఫ్రిది.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. నెమ్మదిగా సాగుతున్న వన్డే క్రికెట్‌లో టీ20 ఆటను ప్రదర్శించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. మొన్నటివరకు వేగవంతమైన సెంచరీ కూడా ఆఫ్రిది(1996, 37 బంతుల్లో) పేరుమీదే ఉండేది. ఇక 2015లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి ఆట చూడటాన్ని అభిమానులు మిస్సవుతున్నారు. 2018 వరకు టీ20లు ఆడినా అంతగా మెప్పించలేదు. అయితే తనలో ఇంకా సత్తా తగ్గలేదని.. యువ హిట్టర్లతో తానేమీ తీసిపోనని మరోసారి నిరూపించాడు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో మునపటి ఆఫ్రిదిని గుర్తుతెచ్చాడు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ చెలరేగిపోయాడు. బ్రాంప్టన్ వోల్వ్స్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఆఫ్రిది ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన విశ్వరూపం ప్రదర్శించాడు.
ఆఫ్రిది(81; 40 బంతుల్లో 10ఫోర్లు, 5 సిక్సర్లు) బౌండరీలతో హోరెత్తించాడు. ఎడ్మాంటన్ రాయల్స్ బౌలింగ్‌ను చిత్తుచిత్తు చేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆఫ్రిదికి తోడుగా సిమ్మన్స్(59, 34 బంతుల్లో 5ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపివ్వడంతో బ్రాంప్టన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఎడ్మాంటన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 180 పరుగులే చేసి ఓటమి పాలైంది. బ్యాట్‌తో మెరిసిని ఆఫ్రిది బౌలింగ్‌లోనూ వికెట్ దక్కించుకున్నాడు. కీలక సమయంలో మహ్మద్ హఫీజ్‌ను ఔట్ చేశాడు. ఇక ఆఫ్రిది బ్యాటింగ్ మెరుపులను టీ20 కెనడా లీగ్ తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగహల్‌చల్ చేస్తోంది. ‘బుమ్ బుమ్ ఆఫ్రిది ఇజ్ బ్యాక్’, ‘ఆఫ్రిది ఆగయా.. బౌండరీ జాయేగా’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment