సొంత జట్టుకు వ్యతిరేకంగా బెట్టింగ్ | Gurunath named in betting chargesheet | Sakshi
Sakshi News home page

సొంత జట్టుకు వ్యతిరేకంగా బెట్టింగ్

Published Mon, Sep 23 2013 12:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM

సొంత జట్టుకు వ్యతిరేకంగా బెట్టింగ్

సొంత జట్టుకు వ్యతిరేకంగా బెట్టింగ్

ముంబై: ఐపీఎల్ ఆరో సీజన్‌లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై ముంబై పోలీసులు నమోదు చేసిన చార్జిషీట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లపై ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలాగే బెట్టింగ్‌లో నిండా మునిగిన గురునాథ్ మెయ్యప్పన్ తమ సొంత జట్టుకు వ్యతిరేకంగా బెట్‌లు కాసేవాడని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. గురునాథ్, విందూ దారాసింగ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణల్లో ఇది తేలిందని చెప్పారు. ‘మే 12న రాజస్థాన్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి వీరిద్దరు మాట్లాడుకున్నారు. చెన్నై 130-140 పరుగులు సాధిస్తుందని విందూకు చెప్పాడు. ఆ రోజు చెన్నై 141 పరుగులు చేసింది. ఇలాంటి సమాచారం సెషన్ బెట్టింగ్‌కు చాలా కీలకంగా మారుతుంది. అలాగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుస్తుందని గురునాథ్ బెట్టింగ్ కాశాడు. అంతేకాకుండా మే 14న ఉదయం చెన్నై, ఢిల్లీ మ్యాచ్ గురించి మాట్లాడుతూ మనం కచ్చితంగా గెలుస్తాం.. టీమ్‌లో ఎలాంటి మార్పులు లేవు అని విందూకు చెప్పాడు. కేకేఆర్, బెంగళూరు మ్యాచ్‌కు సంబంధించిన అంతర్గత విషయాలను కూడా గురునాథ్ బహిర్గతం చేశాడు. ముంబైతో జరిగే మ్యాచ్‌ను సన్‌రైజర్స్ గెలుస్తుందని కూడా చెప్పాడు. మెయ్యప్పన్ వాయిస్ శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపాం. నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం’ అని తమ చార్జిషీట్‌లో విపులంగా వివరించారు. గురునాథ్ కచ్చితంగా చెన్నై జట్టు యజమాని అని సాక్షి నరేశ్ హిమ్మత్‌లాల్ మకానీ చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు.
 
 అంపైర్ రవూఫ్ బెట్టింగ్ కాసేవాడు: పోలీసులు
 పాకిస్థాన్ అంపైర్ అసద్ రవూఫ్ ఐపీఎల్ సందర్భంగా బుకీల నుంచి బహుమతులు స్వీకరించడమే కాకుండా స్వయంగా బెట్టింగ్ కూడా కాసేవాడని పోలీసులు తెలిపారు. దీనికి తగిన సాక్ష్యాలను తమ చార్జిషీట్‌లో పొందుపరిచారు. మ్యాచ్‌కు సంబంధించిన సమాచారాన్ని బుకీలను అందించినందుకు రవూఫ్ విలువైన బహుమతులు పొందాడని, అలాగే తాను స్వయంగా అంపైరింగ్ చేసే మ్యాచ్‌లపై బెట్టింగ్‌కు దిగేవాడన్నారు. విందూ, బుకీలతో మాట్లాడిన ఫోన్ రికార్డులను పోలీసులు సంపాదించారు.  ‘మే15న మధ్యాహ్నం విందూతో ‘ఈరోజు జీవితంలో గెలుపో.. ఓటమో తేలుతుంది’ అని రవూఫ్ చెప్పడంతో వెంటనే విందూ బుకీలకు ఫోన్ చేసి అతడు చెప్పిన మ్యాచ్‌పై భారీ మొత్తంలో బెట్  కాయమని చెప్పాడు’ అని పోలీసుల రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement