అనుకున్నది సాధించాడు
బాక్సర్ మనోజ్‌కు ‘అర్జున’
న్యూఢిల్లీ: అన్ని అర్హతలు ఉన్నా... ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ కోసం తన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో కోర్టుకెక్కిన భారత స్టార్ బాక్సర్ మనోజ్ కుమార్ అనుకున్నది సాధించాడు. ఈ అవార్డు కోసం అతడి పేరును పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు సూచించడంతో కేంద్ర క్రీడా శాఖ అతడి నామినేషన్‌పై ఆమోద ముద్ర వేసింది. ఇంచియాన్‌లో ఆసియా గేమ్స్ ముగిసిన అనంతరం మనోజ్‌కు అర్జున అవార్డును అందిస్తామని క్రీడా శాఖ కార్యదర్శి అజిత్ శరన్ తెలిపారు. కపిల్ దేవ్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ మనోజ్ విషయంలో పొరపాటు పడి అతడు డోపింగ్‌లో దొరికినట్టు భావించి మరో బాక్సర్ జై భగవాన్‌ను ఎంపిక చేసింది. ఈవిషయమై మనోజ్ పట్టు వదలకుండా పోరాడాడు. ‘అర్జున దక్కనున్నందుకు ఆనందంగా ఉంది. ఓవరాల్‌గా మా సోదరుడు రాజేశ్ నా తరఫున ఒంటరి పోరాటం చేశాడు. నావైపు న్యాయం ఉన్నందుకే కోర్టుకెక్కాల్సి వచ్చింది. క్రీడా శాఖ సంయుక్త కార్యదర్శి ఓంకార్ ఖేడియా ఈ శుభవార్తను మా సోదరుడు మంగళవారమే చెప్పినా నాకు ఈరోజు (బుధవారం) తెలిసింది’ అని మనోజ్ ఆనందం వ్యక్తం చేశాడు.