హామిల్టన్‌కే ‘పోల్’
నేడు చైనా గ్రాండ్‌ప్రి రేసు
షాంఘై: గత ఏడాది జరిగిన తప్పిదాన్ని ఈసారి పునరావృతం చేయకుండా జాగ్రత్త పడిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అనుకున్న ఫలితాన్ని సాధించాడు. ఫార్ములావన్ చైనా గ్రాండ్‌ప్రి రేసు క్వాలిఫయింగ్ సెషన్‌లో ఈ బ్రిటన్ డ్రైవర్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 31.678 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు.
ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని అతను దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది వరుసగా రెండో పోల్ పొజిషన్. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలోనూ హామిల్టన్‌కు పోల్ పొజిషన్ లభించిన సంగతి తెలిసిందే. గత ఏడాది చైనా గ్రాండ్‌ప్రి క్వాలి ఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ నిబంధనలకు విరుద్ధంగా గేర్ బాక్స్‌ను మార్చాడు. దాంతో అతనిపై నిర్వాహకులు పెనాల్టీని విధించారు. ఫలితంగా హామిల్టన్ ప్రధాన రేసును చివరిదైన 22వ స్థానంతో ప్రారంభించాడు.
కానీ ఈసారి మాత్రం క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ 3 సెషన్స్‌లోనూ ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. వెటెల్ (ఫెరారీ), బొటాస్ (మెర్సిడెస్) వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఒకాన్ వరుసగా 8వ, 20వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు.
గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెటెల్ (ఫెరారీ), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. రైకోనెన్ (ఫెరారీ), 5. రికియార్డో (రెడ్‌బుల్), 6. మసా (విలియమ్స్), 7. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 8. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 9. క్వియాట్ (ఎస్టీఆర్), 10. లాన్స్ స్ట్రోల్ (విలియమ్స్), 11. కార్లోస్ సెయింజ్ (ఎస్టీఆర్), 12. మాగ్నుసెన్ (హాస్), 13. అలోన్సో (మెక్‌లారెన్), 14. ఎరిక్సన్ (సాబెర్), 15. గియోవినాజి (సాబెర్), 16. వాన్‌డూర్నీ (మెక్‌లారెన్), 17. గ్రోస్యెన్ (హాస్), 18. పాల్మెర్ (రెనౌ), 19. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), 20. ఒకాన్ (ఫోర్స్ ఇండియా).
నేటి ప్రధాన రేసు ఉదయం గం. 11.25 నుంచి
స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ హెచ్‌డీ–2లో ప్రత్యక్ష ప్రసారం