తన టీచర్లతో... సెయింట్ ఆండ్రూస్ స్కూల్ మైదానంలో...
అందరిలాగే ఆ కుర్రాడికి క్రికెట్ పిచ్చి. సచిన్ అంటే అభిమానం రెండూ ఉన్నాయి. ఆటను అమితంగా ఇష్టపడే కుర్రాడు సచిన్ ఔటైతే మాత్రం జీర్ణించుకోలేడు. అందుకే ఔటైన ప్రతీసారీ ఏడ్చేవాడు. ఇప్పుడు ఆ కుర్రాడు ఓ జాతీయ క్రికెటర్ అయ్యాడు. భారత టెస్టు జట్టు సభ్యుడయ్యాడు. అతనే హనుమ విహరి. గతంలో హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విహారి ప్రస్తుతం ఆంధ్ర రంజీ జట్టుకు ఆడుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకున్నాడు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర రంజీ కెప్టెన్, భారత టెస్టు క్రికెటర్ హనుమ విహారి తాను ‘అ. ఆ.’లు దిద్దిన స్కూలుకెళ్లాడు. అక్కడ గత స్మృతుల్ని నెమరువేసుకున్నాడు. తరచి చూసుకుంటే నేను అప్పుడూ విద్యార్థినే ఇప్పుడూ విద్యార్థినే (క్రికెట్లో) అని గర్వపడుతున్నాడు. బోయిన్‌పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌లో విద్యనభ్యసించిన ఈ తెలుగు క్రికెటర్ మంగళవారం తన స్కూల్‌లో సందడి చేశాడు. అధ్యాపకుల్ని నమస్కరించి, విద్యార్థులతో ముచ్చటించాడు. అందరిలాగే తన క్రికెట్ దేవుడు సచినే అన్నాడు. అచ్చంగా... నిజంగా... ‘మాస్టర్ బ్యాట్స్‌మన్’ ఆటను చూసే క్రికెట్‌లోకి వచ్చానని చెప్పుకొచ్చాడు. ‘నేను క్రికెట్ ఆడటానికి కారణం సచినే. ఊహ తెలిసినప్పటి నుంచి టీవీల్లో క్రికెట్ వస్తే సచిన్ బ్యాటింగ్‌ను తెగ చూసేవాడిని. ఔటైతే మాత్రం తట్టుకోను. ఏడ్చేవాణ్ని. ఎందుకంటే అతడే నా హీరో’ అని విహారి అన్నాడు. జట్టులోకి ఎంపికైనట్లు తెలియగానే ఆ ఆనందక్షణాల నుంచి తేరుకోలేకపోయానన్నాడు.
తరగతి గదిలో...
బెంగళూరులోని అకాడమీలో ప్రాక్టీస్ సెషన్‌ను అప్పుడే ముగించుకొని వెళ్తున్న తనకు టీమ్ మేనేజర్ ఫోన్ చేసి ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైనట్లు చెప్పడంతో ఒక్కసారిగా 10–15 నిమిషాలు మారుమాట్లాడలేకపోయానని అప్పటి విషయాన్ని వివరించాడు. వెంటనే తన కెరీర్ కోసం అంకితమైన తన మాతృమూర్తికి ఫోన్ చేసి సంతోషాన్ని పంచుకున్నానని చెప్పాడు. రెండో ఫోన్ మెంటార్ జాన్ మనోజ్‌కు చేసినట్లు చెప్పాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత డ్రెస్సింగ్ రూమ్‌కు తొలిసారి వెళ్తుంటే ఎంతో ఉద్విగ్నంగా అనిపించిందని తెలిపాడు. ‘కల నెరవేరింది. జట్టులో స్థానం దొరికింది. కోహ్లిలాంటి స్టార్ క్రికెటర్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అనుభవం వచ్చినందుకు ఎంతో సంతోషపడ్డాను.
ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. సభ్యులందరు నన్ను ఆదరంగా చూశారు. విరాట్‌తో మాటలు కలిశాయి. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండే సవాళ్లను వివరిస్తూ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నాడు. నా శక్తిమేరకు రాణించేందుకు ప్రయత్నించాను. ప్రపంచ క్రికెట్‌లో నంబర్‌వన్ భారత జట్టులో సభ్యుడినైనందుకు ఎంతో గర్వంగా ఫీలయ్యాను. ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయంలో భాగమైనందుకు సంబరపడ్డాను’ అని విహారి వివరించాడు. ఎంచుకున్న లక్ష్యాల కోసం ఇష్టంగా కష్టపడితేనే అవన్నీ సాకారమవుతాయని విద్యార్థులకు సలహా ఇచ్చాడు. ఆటలో సవాళ్లు ఎలా ఎదురవుతాయో... జీవితంలో కూడా ఎదురవుతాయని అన్నింటిని స్వీకరించాలని సూచించాడు.
Comments
Please login to add a commentAdd a comment