'క్రికెట్తో సమానంగా చూస్తున్నారు'
కోల్కతా: ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్గా చరిత్ర సృష్టించి ఇటీవల జరిగిన రియోకు వెళ్లిన దీపా కర్మకర్... ప్రస్తుతం జిమ్నాస్టిక్స్ పై పెరుగుతున్న ఆదరణపై సంతోషం వ్యక్తం చేసింది. గతంలో తాను క్రికెట్లో చూసిన విశేష అభిమానుల సంఖ్య ఇప్పుడు జిమ్నాస్టిక్స్లో చూస్తున్నట్లు దీపా తెలిపింది. ఈ మేరకు చాలా మంది అభిమానులు జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడానికి అడ్మిషన్లు తీసుకున్నట్లు తనతో చెప్పారని పేర్కొంది.
'ఇప్పటికే చాలామంది జిమ్నాస్టిక్ గేమ్స్పై ఆసక్తి కనబరుస్తున్నారు. చాలామంది జిమ్నాస్టిక్స్ను నేర్చుకోవడానికి సిద్ధమవుతున్న విషయం విని సంతోషం కల్గింది. జిమ్నాస్టిక్స్ను క్రికెట్ తో పోల్చుతూ ఆ గేమ్ను ఎంచుకుంటున్నారు' అని దీపా స్పష్టం చేసింది. ఈ ఒలింపిక్స్లో పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయినా, వచ్చే టోక్యో ఒలింపిక్స్లో కచ్చితంగా పతకంతో తిరిగి వస్తానని పేర్కొంది.