'ఇండో-పాక్ మ్యాచ్ మాకు పెద్ద సమస్యేం కాదు'
వరల్డ్ కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ టీ-20 మ్యాచును కోల్‌కతాలో నిర్వహిస్తుండటంపై బెంగాల్ క్రికెట్ అసిసోయేషన్ (క్యాబ్) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచు వేదిక హఠాత్తుగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు మారడం తమ అదృష్టమని పేర్కొన్నాడు. కోల్‌కతాలో గతంలోనూ ఇండో-పాక్ మ్యాచులను నిర్వహించామని, ఈసారి మరింత ఉత్తమంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన ఓ జాతీయ చానెల్‌తో చెప్పారు.
మధ్యప్రదేశ్ ధర్మశాలలో ఈ నెల 19న జరుగాల్సిన భారత్-పాక్ మ్యాచును అకస్మాత్తుగా కోల్‌కతాకు మార్చిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచుకు కొన్ని రోజులే ఉండటంతో కోల్‌కతాలో ఇందుకు తగినన్ని సన్నాహాలు చేయడం కష్టమని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ అభిప్రాయపడ్డారు. ఆయన అభిప్రాయాన్ని గంగూలీ సున్నితంగా తోసిపుచ్చారు. 'వరల్డ్ కప్ మ్యాచులతోపాటు ఫైనల్ కోసం కూడా మేం ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించాల్సి రావడం నాకు అవకాశమే కానీ సవాల్ కాబోదు. మొత్తం టోర్నమెంట్ కోసం మేం ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి.
ఇందులో భాగంగానే మరో మ్యాచుకు ఆతిథ్యం ఇవ్వాల్సి రావడం పెద్ద కష్టమేమీ కాదు. అకస్మాత్తుగా ఈ మ్యాచుకు ఆతిథ్యం ఇవ్వాల్సి వస్తే సమస్య ఎదురయ్యేది కానీ, మేం ఇప్పటికే వరల్డ్ కప్ మ్యాచుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నేపథ్యంలో ఇదేం పెద్ద సమస్య కాదు' అని 43 ఏళ్ల గంగూలీ తెలిపారు. భారత్-పాక్ మ్యాచ్ కోసం పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ మ్యాచుకు ఎలాంటి లోటు రానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.