మినీ వరల్డ్‌కప్ అంబాసిడర్‌గా హర్భజన్
దుబాయ్: మరో 50 రోజుల్లో ప్రారంభమయ్యే మిని వరల్డ్‌కప్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి-2017కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం 8 మంది సీనియర్ క్రికెటర్లను ప్రచారకర్తలుగా ప్రకటించింది. ఈ అంబాసిడర్లలో భారత్ నుంచి ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఈ అంబాసిడర్లు జూన్ 1 నుంచి 8 మధ్య ఇంగ్లండ్,వేల్స్‌లో జరిగే మూడు వేదికలకు ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నారు.
అంబాసిడర్లలో హర్భజన్‌తో పాటు పాకిస్థాన్ స్పిన్నర్ షాహిద్ ఆఫ్రిది, హబీబుల్ బాషర్ (బంగ్లాదేశ్), ఇయన్‌బెల్( ఇంగ్లండ్), షేన్‌బాండ్ (న్యూజిలాండ్), మైక్ హాస్సీ (ఆస్ట్రేలియా) కుమార సంగక్కర (శ్రీలంక), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా)లున్నారు. ఈ మాజీ క్రికెటర్లందరూ 1,774 అంతర్జాతీయ వన్డేలు ఆడి 51,906 పరుగులు, 48 సెంచరీలు చేశారు. ఇక బౌలింగ్‌లో 838 వికెట్లు పడగొట్టారు. ఈ మాజీలంతా ఛాంపియన్స్ ట్రోఫి పట్ల ఆదరణ పెరిగేలా కృషి చేయనున్నారు. ఈ టోర్నమెంట్లో జరిగే 15 మ్యాచ్‌లకు కొత్త తరాన్ని క్రికెట్ వైపు ఆకర్షించేలా కృషి చేస్తారని ఐసీసీ సీఈవో రిచర్డ్సన్ పేర్కొన్నాడు. ఈ దిగ్గజాలతో కొన్ని స్కూళ్లు సందర్శించి పిల్లలకు క్రికెట్ మెళుకువలు నేర్పుతామని రిచర్డ్సన్ పేర్కొన్నాడు.
2002లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ జట్టులో సభ్యుడైన హర్భజన్ తన ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్ బరిలోకి దిగే గ్లోబల్ ఈవెంట్‌కు అంబాసిడర్‌గా ఎంపికవ్వడం గర్వంగా ఉందన్నాడు. టోర్నమెంట్‌ను ప్రమోట్ చేయడంలో తన వంతు భాద్యతను నిర్వర్తిస్తానని హర్భజన్ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫి కచ్చితంగా భారత్ గెలుస్తుందని బజ్జీ ఆశాభావం వ్యక్తం చేశాడు.