బర్గర్లు తింటే తప్పేంటి : హర్భజన్‌ సింగ్‌ | Harbhajan Singh Defends Sarfaraz Ahmed After Social Media Trolls | Sakshi
Sakshi News home page

బర్గర్లు తింటే తప్పేంటి : హర్భజన్‌ సింగ్‌

Published Tue, Jun 18 2019 10:38 AM | Last Updated on Tue, Jun 18 2019 4:54 PM

Harbhajan Singh Defends Sarfaraz Ahmed After Social Media Trolls - Sakshi

లండన్‌ : ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత పాకిస్తాన్‌పై విమర్శలతో సోషల్‌ మీడియా హోరెత్తింది. ముఖ్యంగా పాక్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, మ్యాచ్‌కు ముందు రోజు బయట షికార్లు చేశారంటూ ఆ దేశ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓటమిని జీర్ణించుకోలేని ఓ అభిమాని.. ‘ఎన్నో సమస్యలు ఉన్న పాకిస్తాన్‌లో మాకు క్రికెట్‌ కొంత సాంత్వననిస్తుంది. ఎంతో డబ్బు పెట్టి, ఇబ్బందులు పడి ఎన్నో ఆశలతో ఇక్కడికొస్తే ఇలాంటి ఆట ఆడతారా? ఆటగాళ్లకు కనీస ఫిట్‌నెస్‌ కూడా లేదు. మ్యాచ్‌కు ముందు రోజు  రాత్రి వారు పిజ్జాలు, బర్గర్లు, ఐస్‌క్రీమ్‌లు తిన్నారని విన్నాను. ఎవరైనా ఆటగాళ్లు ఇలాంటి తిండి తింటారా? వీరు క్రికెట్‌లో కాదు కుస్తీలో పోటీ పడాల్సింది.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. అయితే పాకిస్తాన్‌పై జరుగుతున్న ఈ తరహా ట్రోలింగ్‌పై టీమిండియా స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. పిజ్జాలు, బర్గర్లు తింటే తప్పేంటని పాక్‌ ఆటగాళ్లను వెనకేసుకొచ్చాడు. ఆటగాళ్లు వారి ఇష్టమైన ఆహారన్ని తినవచ్చని అభిప్రాయపడ్డాడు. వారి ఆహారమే చెత్త ప్రదర్శనకు కారణమని చెప్పడం సరికాదన్నారు. మ్యాచ్‌కు ముందు రోజు పాక్‌ క్రికెటర్లు షికారు చేశారని, షోయబ్‌ మాలిక్‌ తన భార్య సానియా మీర్జా, ఇద్దరు సహచరులతో కలిసి ‘హుక్కా కేఫ్‌’లో ఉన్న ఫోటోలు వైరల్‌ అవ్వడంపై కూడా భజ్జీ స్పందించాడు.

‘అది నిజమో కాదో నాకు తెలియదు. ఒక వేళా అలా మ్యాచ్‌ ముందు రోజు షికారు చేస్తే మాత్రం సరైంది కాదు. అది ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ అయితే అస్సలు అలాంటి పనిచేయకూడదు. అదంతా అసత్యమనే అనుకుంటున్నా’ అని హర్భజన్‌ పేర్కొన్నాడు. భారత్‌తో ఓటమితో పాకిస్తాన్‌ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఆ జట్టు సెమీస్‌ చేరాలంటే న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌లతో జరిగే 4 మ్యాచ్‌లను తప్పకుండా గెలవాలి. ఒకవేళ పాక్‌ ఓడిపోయి.. సెమీస్‌ చేరకుంటే మాత్రం సర్ఫరాజ్‌ తన కెప్టెన్సీ పదవి కోల్పోతాడని హర్భజన్‌ జోస్యం చెప్పాడు. ‘వారు విజయాలు పొందుతారని ఆశిస్తున్నాను. ఒక వేళ వారు సెమీస్‌కు వెళ్లకుండా ఉంటే.. భారత్‌, పాక్‌లో చెలరేగే భావోద్వేగాలు నాకు తెలుసు. నాకు తెలిసి సర్ఫరాజ్‌ తన కెప్టెన్సీ  కూడా కోల్పోతాడు. ఇది భారత్‌-పాక్‌లో సర్వసాధారణమే. గతంలో చాలా మంది జట్టులోనే స్థానాలు కూడా కోల్పోయారు.’ అని భజ్జీ తెలిపాడు.
చదవండి: ‘సర్ఫరాజ్‌ స్లీప్‌ ఫీల్డర్‌’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement