హర్దిక్ పాండ్యా వివాదాస్పద ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: టీమిండియా యువ సంచలనం హార్దిక్ పాండ్యా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. దీంతో వెంటనే పాండ్యా ఆ ట్వీట్‌ను డిలీట్ చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలవడం కన్నా.. సహచర ఆటగాడు జడేజా కారణంగా హార్దిక్ పాండ్యా ఔటయిన తీరే అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన రోజు రాత్రి హార్ధిక్.. ' మమ్మల్ని మేమే మోసం చేసుకున్నాం. ప్రత్యర్ధి జట్టుకు అంత సామర్థ్యం లేదు' అని ట్వీట్ చేయగా వైరల్‌గా మారింది. ఆ వివాదాస్పద ట్వీట్‌ను పాండ్యా డిలీట్ చేసినా.. ఓ నెటిజన్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయడంతో విపరీతంగా రీట్వీట్ అవుతోంది.
వాస్తవానికి రవీంద్ర జడేజా బంతిని ఆడి ముందుకు పరుగెత్తగా.. పాండ్యా స్ట్రైకింగ్ వైపు వేగంగా కదిలాడు. ఇంతలోనే మనసు మార్చుకున్న జడేజా వెనక్కి పరుగు తీశాడు. మొదట క్రీజులో బ్యాట్ పెట్టిన జడేజా నాట్‌ట్ కాగా, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో బెయిల్స్ పడగొట్టడంతో.. సిక్సర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడుతున్న పాండ్యా తీవ్ర నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత కూడా జడేజా.. అశ్విన్‌తో పరుగు కోసం పిలిచి వెనక్కి వెళ్లడం చూసిన అభిమానులు అతడిపై మరింత ఆవేశంగా ఉన్నారు. 32 బంతుల్లోనే 3 సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి ఐసీసీ టోర్నీల్లోనే ఫైనల్లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచిన హార్దిక్ (43 బంతుల్లో 76; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) రనౌట్ కావడమే అభిమానులను ఎక్కువగా బాధించింది. హార్దిక్ మరికాసేపు క్రీజులో ఓటమి అంతరాన్ని తగ్గించేవాడని, జడేజా తన వికెట్‌ను త్యాగం చేస్తే మంచి ఫలితం ఉండేదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.