ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సోదరుడు కృనాల్‌తో హార్దిక్ పాండ్యా
ముంబై : మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఎయిర్ పోర్ట్‌లో కనిపించాడు. సోదరుడు కృనాల్ పాండ్యాతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఈ ఆల్‌రౌండర్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌చేస్తున్నాయి. పాండ్యాతో పాటు సస్సెన్షన్ గురైన కేఎల్ రాహుల్ కూడా ఆస్ట్రేలియా నుంచి అర్ధాంతరంగా తిరుగొచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇంటికి చేరుకున్న పాండ్యా గదిలో నుంచి బయకు రావడం లేదని, ఎవరు ఫోన్ చేసినా స్పందించడం లేదని, అతని తండ్రి హిమాన్షు మీడియాకు తెలిపిన విషయం తెలిసిదే. ఈ నేపథ్యంలో హార్దిక్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది. కరణ్ షోలో చేసిన తన వ్యాఖ్యల పట్ల పాండ్యా తీవ్రంగా కుమిలిపోతున్నాడని, బీసీసీఐ సస్పెన్షన్‌తో తీవ్రంగా బాధపడుతున్నాడని అతని తండ్రి మీడియాతో తెలిపారు. తాము కూడా ఈ విషయం గురించి అతనితో మాట్లాడదలుచుకోలేదని, తన సోదరుడు కృనాల్ సైతం ఈ ఎపిసోడ్ వ్యవహారంపై హార్దిక్‌తో మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. కేవలం బీసీసీఐ తీసుకోబోయే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.
నిషేధం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన వీరిద్దరు మళ్లీ ఎప్పుడు క్రికెట్‌లో అడుగు పెడతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. బీసీసీఐ నియమావళి ప్రకారం ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డు నియమించిన అంబుడ్స్‌మన్‌కే ఉంది. ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్‌మన్‌కే ఇవ్వాలి. అయితే ఇప్పటికిప్పుడు అంబుడ్స్‌మన్‌ను నియమించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంబుడ్స్‌మన్‌ను నియమించే అధికారం కేవలం బోర్డుకే ఉందని...అది ఎన్నికలు నిర్వహించి కార్యవర్గం ఏర్పడిన తర్వాత మాత్రమే సాధ్యమని తెలిపింది. దీంతో పాండ్యా, రాహుల్‌భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.
మరోవైపు తప్పులు చేయడం మానవ సహజమని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాండ్యా, రాహుల్‌లకు మద్దతు తెలిపారు. ఈ వ్యవహారంతో వారి కెరీర్ దెబ్బతినేలా చర్యలు తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఒళ్లు మరిచి చేసిన వ్యాఖ్యలతో పాండ్యా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాడు. సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిల్లేట్ సంస్థ పాండ్యాతో చేసుకున్న ఒప్పందాన్ని విరమించుకుంది. అంతేకాకుండా ముంబైలో ప్రతిష్టాత్మక క్లబ్ అయిన ‘ఖర్ జింఖానా’లో గౌరవ సభ్యత్వాన్ని కూడా పాండ్యా కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment