ప్రిక్వార్టర్స్‌కు హారిక
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్
సోచి (రష్యా): నిర్ణాయక టైబ్రేక్‌లలో తన సత్తా చాటుకున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఇరీనా క్రుష్‌తో జరిగిన రెండో రౌండ్‌లో హారిక టైబ్రేక్‌లో 1.5-0.5తో విజయం సాధించి ముందంజ వేసింది. శనివారం నిర్ణీత రెండు గేమ్‌లు ముగిసిన తర్వాత వీరిద్దరు 1-1తో సమఉజ్జీగా నిలిచారు.
దాంతో ఫలితం తేలడానికి ఆదివారం రెండు టైబ్రేక్ గేమ్‌లను నిర్వహించారు. తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 70 ఎత్తుల్లో గెలుపొంది... తెల్ల పావులతో ఆడిన రెండో గేమ్‌ను 58 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో హారిక ఆడుతుంది. మరోవైపు ఈ టోర్నీలో ఆడిన నాలుగు గేముల్లోనూ నెగ్గిన కోనేరు హంపి ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో అలీసా గలియమోవా (రష్యా)తో తలపడుతుంది.