ప్రపంచాన్ని గెలవాలి...
♦ వరుసగా రెండు టైటిల్స్ గెలవడం సంతోషం
♦ ఒలింపియాడ్‌లో భారత్ పతకం సాధిస్తుంది
♦ మరింత మంది మహిళా జీఎంలు రావాలి
♦ ‘సాక్షి’తో చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక
♦ జీవిత లక్ష్యం వరల్డ్ చాంపియన్‌షిప్
♦ తాజా టైటిల్స్ ప్రత్యేకం
♦ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళల చెస్‌లో నిలకడగా రాణిస్తున్న క్రీడాకారిణుల్లో ద్రోణవల్లి హారిక ఒకరు. దశాబ్ద కాలంగా పలు అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ...
నిరంతరం తన ఆటకు పదునుపెడుతూ ఈ తెలుగమ్మాయి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఇటీవల రెండు వారాల వ్యవధిలో రెండు అంతర్జాతీయ ఓపెన్ టోర్నమెంట్లలో మహిళల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. సీనియర్ స్థాయిలో దాదాపు అన్ని మెగా ఈవెంట్స్‌లో పతకాలు నెగ్గిన 25 ఏళ్ల హారికకు ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతకం మాత్రం ఇంకా ఊరిస్తోంది.
ఇప్పటికే రెండుసార్లు ఈ మెగా ఈవెంట్లో కాంస్య పతకాలు సాధించిన హారిక విశ్వవిజేత కావడమే తన ఏకైక లక్ష్యం అని చెబుతోంది. కజకిస్తాన్‌లో జరిగిన యురాసియన్ బ్లిట్జ్ కప్‌లో విజేతగా నిలిచిన అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన హారిక పలు అంశాలపై ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...
ఊహించలేదు: రెండు వారాల వ్యవధిలో రెండు అంతర్జాతీయ ఓపెన్ టోర్నమెంట్లలో మహిళల విభాగంలో విజేతగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. మేటి గ్రాండ్‌మాస్టర్లు పాల్గొన్న ఈ టోర్నీల్లో అనుభవజ్ఞులైన వారితో తలపడ్డాను. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఆడుతూ ముందుకెళ్లాను. చివరికి ఈ రెండు టోర్నీల్లో మహిళల కేటగిరిలో అగ్రస్థానాన్ని సంపాదించడం చాలా సంతోషాన్నిచ్చింది. యురాసియన్ బ్లిట్జ్ కప్‌లో ఇజ్రాయెల్ గ్రాండ్‌మాస్టర్ బోరిస్ గెల్ఫాండ్‌తో ఆడిన గేమ్‌లు ప్రత్యేకం.
ఆయన గురించి ఎంతో విన్నాను. ఇప్పుడు ముఖాముఖిగా తలపడ్డాను. చైనా, రష్యా క్రీడాకారిణులు రెగ్యులర్‌గా బ్లిట్జ్ టోర్నీల్లో పాల్గొంటారు. వారితో పోలిస్తే ఈ తరహా టోర్నీల్లో అంతగా అనుభవం లేకున్నా ఆడి టాప్ ర్యాంక్ సాధించినందుకు ఈ రెండు విజయాలు నాకెంతో సంతృప్తినిచ్చాయి.
చెస్ ఒలింపియాడ్‌లో రాణిస్తాం: వచ్చే నెల ఆరంభంలో చైనాలో జరిగే మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీలో బరిలోకి దిగుతున్నాను. ఆ తర్వాత సెప్టెంబరులో అజర్‌బైజాన్‌లో జరిగే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ టీమ్ ఈవెంట్‌లో పాల్గొంటాను. నాలుగేళ్ల క్రితం ఒలింపియాడ్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి కోనేరు హంపి ఒలింపియాడ్‌లో ఆడటంలేదని సమాచారం ఉంది. ఒక వేళ ఆమె ఆడితే జట్టు అవకాశాలు మెరుగు పడతాయి. మేటి జట్లు పాల్గొనే ఈ పెద్ద ఈవెంట్‌లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తాం.
చెస్‌పై నమ్మకం పెరగాలి: మేథో క్రీడ అయిన చెస్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చు. అయితే చెస్ కూడా ఖరీదైన క్రీడగా మారింది. ఒకస్థాయికి చేరుకున్నాకే ఈ ఆటతో భరోసా వస్తుంది. చాలా మంది చిన్న వయసులో మంచి ఫలితాలు సాధిస్తున్నా మధ్యలోనే వదిలేస్తున్నారు. పెద్ద స్థాయిలో విజయాలు దక్కాలంటే నిరంతరం కష్టపడాల్సి ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళా క్రీడాకారిణులు ఏమాత్రం తీసిపోరు. మహిళల విభాగంలో ఇప్పటికైతే నేను, హంపి మాత్రమే గ్రాండ్‌మాస్టర్స్‌గా ఉన్నాం. పట్టుదలతో ప్రయత్నిస్తే మరింత మహిళా క్రీడాకారిణులు గ్రాండ్‌మాస్టర్ హోదా సంపాదిస్తారనే నమ్మకం ఉంది.
ఒలింపిక్స్‌లో చెస్‌ను చూడాలి: విశ్వవ్యాప్తంగా ఆదరణ ఉన్న చెస్ క్రీడాంశం ఒలింపిక్స్‌లో ఎందుకు లేదో ఇప్పటికీ అర్థం కాదు. ఈ ఆట ఎక్కువ సమయం తీసుకుంటుందనేది ఒక కారణం కావొచ్చు. అయితే ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాలను ఒలింపిక్స్‌లో చేర్చే వీలుంది. ఆసియా క్రీడల్లో రెండుసార్లు చెస్‌ను ఆడించారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్‌లో చెస్‌ను ఒలింపిక్స్‌లో చూడాలని అనుకుంటున్నాను.
జీవిత లక్ష్యం ప్రపంచ చాంపియన్: గత రెండు పర్యాయాల్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించాను. వచ్చే ఏడాది జరిగే చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి విశ్వవిజేత కావాలనే లక్ష్యం ఉంది. జూనియర్ స్థాయిలో ప్రపంచ చాంపియన్ అయ్యాను. ఆసియా, కామన్వెల్త్ పోటీల్లోనూ స్వర్ణాలు సాధించాను. భారత్ నుంచి మహిళల విభాగంలో తొలి ప్రపంచ చాంపియన్ నేనే కావాలన్నది నా జీవిత లక్ష్యం. నా లక్ష్యం నెరవేరే వరకు నిరంతరం శ్రమిస్తాను.
వ్యక్తిగతం...
ఇటీవలే ఇండియన్ ఆయిల్‌లో ఆఫీసర్ ‘ఎ’ గ్రేడ్ ఉద్యోగం వచ్చింది. ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వివాహం అయ్యాక కూడా చెస్‌లో కొనసాగుతాను. నన్ను ఆటలో ప్రోత్సహించే వ్యక్తి కావాలనేదే షరతు. ప్రతీ టోర్నీ మధ్యలో దొరికిన విరామాన్ని మేమంతా బాగా ఎంజాయ్ చేస్తాం. అయితే విదేశాల్లో జరిగే టోర్నీల సందర్భంగా భారతీయ వంటకాలు లభించడం కష్టమవుతోంది. కొన్నేళ్లుగా టోర్నీలకు వెళ్లినపుడు సొంతంగా నేనే వంట చేసుకుంటున్నాను.