ఆదాబ్ ఆమ్లా...
100వ టెస్టు ఆడనున్న దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్
జొహన్నెస్‌బర్గ్: పుష్కర కాలంగా దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో ప్రధాన భాగంగా మారిన హషీమ్ ఆమ్లా గురువారం అరుదైన మైలురాయిని చేరుకుంటున్నాడు. తన టెస్టు కెరీర్‌లో అతను వందో టెస్టు బరిలోకి దిగుతున్నాడు. ఇక్కడి వాండరర్స్ మైదానంలో నేటినుంచి దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య జరిగే మూడో టెస్టు ఆమ్లాకు 100వ మ్యాచ్ కానుంది. ‘ప్రొటీస్’ టీమ్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా ఆమ్లా నిలుస్తాడు. 2004 డిసెంబర్‌లో కోల్‌కతాలో భారత్‌తో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడిన హషీం, ఇన్నేళ్లలో సఫారీలు సాధించిన అద్భుత విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు 99 మ్యాచ్‌లలో అతను 49.45 సగటుతో 7665 పరుగులు సాధించాడు. ఇందులో 25 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున నమోదైన ఏకైక ట్రిపుల్ సెంచరీ ఆమ్లా పేరిటే ఉంది.
వ్యక్తిత్వం భిన్నం: మత విశ్వాసాలను పాటించే క్రమంలో టీమ్ జెర్సీపై లిక్కర్ కంపెనీ బ్రాండ్‌ను ప్రదర్శించేందుకు తిరస్కరించిన సమయంలో తొలిసారి హషీం ఆమ్లా గురించి ప్రపంచానికి తెలిసింది. అతని పెద్ద గడ్డాన్ని చూసి కామెంటేటర్ డీన్‌జోన్స్ ‘టెర్రరిస్ట్’ అని సంబోధించడంతోనే ఆమ్లా ఎవరనేది అంతా ఆసక్తి చూపించారు. కానీ ఆమ్లా మాత్రం వీటన్నింటినీ అసలు పట్టించుకోలేదు. కేవలం తన ఆటతోనే అందరికీ సమాధానమిచ్చాడు. వివాదాలకు దూరం, మాటల్లో ఎక్కడా నోరుజారని తత్వం, చెరగని చిరునవ్వు హషీంను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి.
తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో కేవలం 26 పరుగులు, మొదటి ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి 62 పరుగులు, 15 టెస్టుల తర్వాత కూడా సగటు 25.50 మాత్రమే! ఫలితంగానే రెండేళ్ల పాటు జట్టుకు దూరం. కానీ పునరాగమనం చేసిన తర్వాత తిరుగులేని ఆటతో దక్షిణాఫ్రికా సాధించిన అనేక చిరస్మరణీయ విజయాలలో భాగమయ్యాడు. ఇటీవల విఫలమవుతున్న ఆమ్లా తన వందో టెస్టుతో ఫామ్‌లోకి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేసిన డు ప్లెసిస్ ‘బహుశా దక్షిణాఫ్రికా తరఫున వంద టెస్టులు ఆడబోయే చివరి వ్యక్తి ఆమ్లానే’ అని సహచరుడిని ప్రశంసించాడు. ప్రైవేట్ వ్యక్తిగా, తనదైన సొంత ప్రపంచంలోనే ఉండేందుకు ఇష్టపడే ఆమ్లా, తన 100వ టెస్టు గౌరవార్ధం అధికారికంగా ప్రత్యేక డిన్నర్‌ను నిర్వహిస్తామన్న ప్రతిపాదనను తిరస్కరించి మరోసారి తన ప్రత్యేకతను ప్రదర్శించాడు.