South African batsman
-
రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
Hashim Amla: సౌతాఫ్రికా లెజెండరీ క్రికెటర్ హషీం ఆమ్లా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ (జనవరి 18) ప్రకటించాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమ్లా.. తాజాగా మిగతా ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో సర్రే జట్టుకు ఆడుతున్న ఆమ్లా.. ఈ ఏడాది (2023) కౌంటీ సీజన్ బరిలోకి దిగేది లేదని స్పష్టం చేశాడు. గతేడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో లాంకషైర్‌తో తన చివరి మ్యాచ్ ఆడేసిన ఆమ్లా.. ఆ సీజన్లో దాదాపు 40 సగటున 700కు పైగా పరుగులు చేసి తన జట్టును (సర్రే) ఛాంపియన్‌గా నిలిపాడు. రిటైర్మెంట్ ప్రకటనలో ఆమ్లా.. సర్రే టీమ్ స్టాఫ్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా సర్రే డైరెక్టర్ అలెక్ స్టివర్ట్ పేరును ప్రస్తావిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఆమ్లా.. 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు . అంతర్జాతీయ క్రికెట్లో 55 సెంచరీల సాయంతో 18000కు పైగా పరుగులు చేసిన ఆమ్లా.. వన్డేల్లో వేగంగా 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. సౌతాఫ్రికా టెస్ట్ టీమ్ కెప్టెన్‌గానూ వ్యవహరించిన ఆమ్లా.. వన్డేల్లో అత్యంత వేగంగా 10, 15, 16, 17, 18, 20, 25, 27 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆమ్లా ఖాతాలో టెస్ట్‌ల్లో ట్రిపుల్ హండ్రెడ్ (311 నాటౌట్)తో పాటు ఐపీఎల్‌లోనూ 2 సెంచరీలు ఉన్నాయి. -
ఆదాబ్ ఆమ్లా...
100వ టెస్టు ఆడనున్న దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ జొహన్నెస్‌బర్గ్: పుష్కర కాలంగా దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో ప్రధాన భాగంగా మారిన హషీమ్ ఆమ్లా గురువారం అరుదైన మైలురాయిని చేరుకుంటున్నాడు. తన టెస్టు కెరీర్లో అతను వందో టెస్టు బరిలోకి దిగుతున్నాడు. ఇక్కడి వాండరర్స్ మైదానంలో నేటినుంచి దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య జరిగే మూడో టెస్టు ఆమ్లాకు 100వ మ్యాచ్ కానుంది. ‘ప్రొటీస్’ టీమ్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా ఆమ్లా నిలుస్తాడు. 2004 డిసెంబర్లో కోల్‌కతాలో భారత్‌తో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడిన హషీం, ఇన్నేళ్లలో సఫారీలు సాధించిన అద్భుత విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు 99 మ్యాచ్‌లలో అతను 49.45 సగటుతో 7665 పరుగులు సాధించాడు. ఇందులో 25 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున నమోదైన ఏకైక ట్రిపుల్ సెంచరీ ఆమ్లా పేరిటే ఉంది. వ్యక్తిత్వం భిన్నం: మత విశ్వాసాలను పాటించే క్రమంలో టీమ్ జెర్సీపై లిక్కర్ కంపెనీ బ్రాండ్‌ను ప్రదర్శించేందుకు తిరస్కరించిన సమయంలో తొలిసారి హషీం ఆమ్లా గురించి ప్రపంచానికి తెలిసింది. అతని పెద్ద గడ్డాన్ని చూసి కామెంటేటర్ డీన్‌జోన్స్ ‘టెర్రరిస్ట్’ అని సంబోధించడంతోనే ఆమ్లా ఎవరనేది అంతా ఆసక్తి చూపించారు. కానీ ఆమ్లా మాత్రం వీటన్నింటినీ అసలు పట్టించుకోలేదు. కేవలం తన ఆటతోనే అందరికీ సమాధానమిచ్చాడు. వివాదాలకు దూరం, మాటల్లో ఎక్కడా నోరుజారని తత్వం, చెరగని చిరునవ్వు హషీంను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో కేవలం 26 పరుగులు, మొదటి ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి 62 పరుగులు, 15 టెస్టుల తర్వాత కూడా సగటు 25.50 మాత్రమే! ఫలితంగానే రెండేళ్ల పాటు జట్టుకు దూరం. కానీ పునరాగమనం చేసిన తర్వాత తిరుగులేని ఆటతో దక్షిణాఫ్రికా సాధించిన అనేక చిరస్మరణీయ విజయాలలో భాగమయ్యాడు. ఇటీవల విఫలమవుతున్న ఆమ్లా తన వందో టెస్టుతో ఫామ్‌లోకి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేసిన డు ప్లెసిస్ ‘బహుశా దక్షిణాఫ్రికా తరఫున వంద టెస్టులు ఆడబోయే చివరి వ్యక్తి ఆమ్లానే’ అని సహచరుడిని ప్రశంసించాడు. ప్రైవేట్ వ్యక్తిగా, తనదైన సొంత ప్రపంచంలోనే ఉండేందుకు ఇష్టపడే ఆమ్లా, తన 100వ టెస్టు గౌరవార్ధం అధికారికంగా ప్రత్యేక డిన్నర్‌ను నిర్వహిస్తామన్న ప్రతిపాదనను తిరస్కరించి మరోసారి తన ప్రత్యేకతను ప్రదర్శించాడు. -
డివిలియర్స్ ‘సెంచరీ’ మిస్!
బంగ్లాతో టెస్టు సిరీస్‌కు దూరం కేప్‌టౌన్ : కెరీర్ ఆరంభమైననాటినుంచి వరుసగా వంద టెస్టులు ఆడిన తొలి క్రికెటర్ రికార్డుకు చేరువగా వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ దానిని త్రుటిలో కోల్పోయాడు. తన భార్య ప్రసవం కారణంగా బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. డివిలియర్స్ తన కెరీర్లో వరుసగా 98 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అయితే వన్డే జట్టుకు మాత్రం డివిలియర్స్ సారథ్యం వహించనుండగా... టెస్టు కెప్టెన్‌గా ఆమ్లా, టి20 కెప్టెన్‌గా డు ప్లెసిస్ కొనసాగుతారు. జులై 5నుంచి 30 వరకు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న దక్షిణాఫ్రికా జట్టు 2 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది. వాట్సన్‌కు కూతురు సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్‌వాట్సన్ మరోసారి తండ్రయ్యాడు. గత శనివారం వాట్సన్ భార్య లీ అమ్మాయికి జన్మనిచ్చింది. వాట్సన్‌కు ఇప్పటికే విల్ అనే రెండేళ్ల కొడుకు ఉన్నాడు. కూతురుతో కలిసి ఉన్న ఫోటోలను వాట్సన్ ట్విట్టర్లో ఉంచాడు.