40కు పైగా ఓవర్లు..25 పరుగులు
ఢిల్లీ: నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియాకు పరీక్షగా నిలిచిన హషీమ్ ఆమ్లా ఎట్టకేలకు అవుటయ్యాడు. 40.0 కు పైగా ఓవర్లు క్రీజ్ లో నిలుచున్న ఆమ్లాను రవీంద్ర జడేజా చక్కటి బంతితో బోల్తా కొట్టించాడు. 244 బంతుల్లో 3 ఫోర్లు సాయంతో 25 పరుగులు చేసి అత్యంత రక్షణాత్మక పద్ధతిని అనుసరించిన ఆమ్లాను మూడో వికెట్ గా పెవిలియన్ కు పంపి టీమిండియా శిబిరంలో ఆనందం రేకెత్తించాడు. దీంతో ఆమ్లా -ఏబీ డివిలియర్స్ ల సుదీర్ఘ బంతుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ జోడి 42.1 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉండటం విశేషం.
72/2 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే ఆమ్లా వికెట్ కోల్పోవడంతో కాస్త ఆందోళనలో పడింది. ప్రస్తుతం సఫారీలు 90.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 80 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. .డివిలియర్స్(17), డు ప్లెసిస్(0) లు క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు రెండు, జడేజాకు ఒక వికెట్ దక్కింది. 481 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన సఫారీలు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికా ఓటమిని తప్పించుకోవాలంటే రోజంతా క్రీజ్ లో నిలవాల్సి ఉండగా, టీమిండియా విజయానికి ఇంకా ఏడు వికెట్లు అవసరం.