హషీమ్ ఆమ్లా అరుదైన ఘనత
సెంచూరియన్:దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ హషీమ్ ఆమ్లా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో సెంచరీ సాధించడం ద్వారా యాభై అంతర్జాతీయ సెంచరీలను పూర్తి చేసుకున్న ఆటగాళ్ల ఎలైట్ క్లబ్ లో ఆమ్లా చోటు దక్కించుకున్నాడు. శుక్రవారం లంకేయులతో జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో ఆమ్లా 134 బంతుల్లో 154 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఆమ్లా వన్డే కెరీర్ లో 24వ సెంచరీ.
మరొకవైపు ఏబీ డివిలియర్స్ తో కలిసి ఈ ఫార్మాట్ లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. వన్డేల్లో 24 శతకాలు సాధించిన ఆమ్లా.. టెస్టుల్లో 26 సెంచరీలను నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్(100) తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(71) రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత స్థానాల్లో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా(63) , దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు కల్లిస్(62), శ్రీలంక మాజీ ఆటగాడు మహేలా జయవర్ధనే(54), వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రియాన్ లారా(53)లు ఉన్నారు.