
హసీన్ జహాన్, మహ్మద్ షమీ (ఫైల్ ఫొటో)
కోల్‌కతా : రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని అతని భార్య హసీన్ జహాన్ కలిసారు. కూతురితో సహా షమీ నివాసానికి వెళ్లి గాయపడ్డ షమీని పరామర్శించారు. డెహ్రడూన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా షమీ ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో షమీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. జహాన్ షమీని కలిసిన విషయాన్ని ఆమె లాయర్ జాకీర్ హుస్సెన్ ధృవీకరించారు. కోల్‌కతాలోని లాల్‌బజార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు సమాచారమిచ్చి మరి కూతురితో సహా జహాన్ షమీని కలిసిందని ఆయన మీడియాకు తెలిపారు.
షమీ త్వరగా కోలుకోవాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు జహాన్ చెప్పారు. షమీకి చెడు జరగాలని తానెప్పుడూ కోరుకోలేదన్నారు. షమీ తనకు శత్రువేమి కాదని, అతను ఆరోగ్యంగా లేకపోతే తాను సంతోషంగా ఉండలేనని చెప్పుకొచ్చారు. ఇక షమీ బెంగాల్ మాజీ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ అకాడమీలో సాధన చేసి తిరిగి వస్తుండగా అతని కారు ప్రమాదానికి గురైంది.
ఇక షమీకి ఇతర మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని, తనను తీవ్రంగా వేధించాడని హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సైతం పాల్పడ్డాడని ఆరోపణలు చేయడంతో బీసీసీఐ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో షమీకి క్లీన్ చీట్ రావడంతో వార్షిక వేతన కాంట్రాక్టు పునరుద్దరించడంతో పాటు ఐపీఎల్ ఆడే మార్గం సుగుమమైంది.
Comments
Please login to add a commentAdd a comment