మెల్‌బోర్న్ : టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని మరోసారి తన మార్క్‌కీపింగ్‌తో ఔరా అనిపించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్‌ను తనదైన స్టంపింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. గత మ్యాచ్‌లో శతకంతో మెరిసిన షాన్ మార్ష్.. తాజా మ్యాచ్‌లో ధోని దెబ్బకు 39 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. తొలుత మార్ష్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వదిలేసిన ఈ సీనియర్ వికెట్ కీపర్.. కొద్దిసేపటికి ఆ తప్పిదాన్ని చురుకైన స్టంపింగ్‌తో సరిదిద్దుకున్నాడు. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ వేసిన వైడ్ బంతిని ముందుకొచ్చి ఆడబోయిన మార్ష్.. ధోని వ్యూహానికి అడ్డంగా దొరికిపోయాడు. ఈ మ్యాచ్‌లో 6 వికెట్లతో చెలరేగిన చహల్‌కు ఇది తొలి వికెట్ కావడం ఇక్కడ విశేషం.
దీంతో వన్డేల్లో అత్యధికసార్లు స్టంపౌట్ అయిన రెండో బ్యాట్స్‌మన్‌గా షాన్‌మార్ష్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 60 మ్యాచ్‌ల్లో ఈ లెఫ్టార్మ్ బ్యాట్స్‌మన్ ఆరు సార్లు స్టంపౌట్ కావడం గమనార్హం. ఈ జాబితాలో మార్ష్ కన్నా ముందు ఇంగ్లండ్ ఆటగాడు నాసీర్ హుస్సేన్ (77 మ్యాచ్‌ల్లో 8 స్లార్లు) ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సార్లు స్టంపౌట్ అయిన బ్యాట్స్‌మన్‌గా కూడా మార్షే నిలిచాడు. మార్ష్ తరువాత టామ్ మూడీ (52 మ్యాచ్‌ల్లో 5 సార్లు) ఉన్నాడు.
ధోని క్యాచ్ మిస్.. పెదవి విరిచిన కోహ్లి
అంతకుముందు భారత పార్ట్‌టైం స్పిన్నర్ కేదార్ జాదవ్ వేసిన 17వ ఓవర్‌లో షాన్ మార్ష్ బంతిని కట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లింది. కానీ.. ఆ బంతిని ధోని జారవిడచడంతో.. సునాయస క్యాచ్ నేలపాలైంది. రెండో వన్డేలో శతకం బాది మంచి ఫామ్‌లో ఉన్న షాన్ మార్ష్.. ఔట్ అయ్యే మంచి అవకాశం చేజారడంతో బౌలర్ కేదార్ జాదవ్, కెప్టెన్ కోహ్లిలు పెదవి విరిచారు. ఇది టీవీలో స్పష్టంగా కనిపించింది. ఇక నిలకడలేమి ఆటతో విమర్శలు ఎదుర్కొన్న ధోని ఈ సిరీస్‌తో గాడిలో పడ్డాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఈ మాజీ కెప్టెన్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రెండో వన్డేలో విలువైన పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment