మాస్కో : ఫిఫా ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారంతో ఈ మహాసంగ్రామం ముగియనుంది. 32 జట్లు..736 మంది ఆటగాళ్లు..11 నగరాల్లో.. 12 మైదానాలు..62 మ్యాచ్‌లతో 31 రోజులు పాటు జరిగిన ఈ సంగ్రామంలో యూరప్ దేశాలే పై చేయి సాధించాయి. అనూహ్యంగా ఫ్రాన్స్-క్రోయేషియా ఫైనల్‌కు చేరగా.. జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్, అర్జెంటీనా, స్పెయిన్, ఇంగ్లండ్ హాట్ ఫేవరేట్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ప్రస్తుతం ఫుట్‌బాల్ జట్ల గురించి ఓ ఆసక్తికరమైన విషయం చర్చనీయాంశమైంది.
11 మంది సభ్యులు గల ప్రతీ జట్టులో దాదాపు ఒక వలస ఆటగాడు ఉన్నాడు. ఇలా పుట్టిన దేశం తరపున కాకుండా ఇతర దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లు మొత్తం 98 మంది ఉన్నారు. వీరంతా ఫుట్‌బాల్‌పై ఉన్న పిచ్చితో తమ దేశం కాకపోయినా బరిలోకి దిగిన జట్టుకు ప్రాణం పెట్టి మరీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొందరి ఆటగాళ్ల తల్లితండ్రులు వలస వచ్చి స్థిరపడగా.. మరికొందరు ఆటకోసమే ఇతర దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకో జట్టులో ఏకంగా 61.5 శాతం మంది వలసవాదులు ఉండటం విశేషం. ఆ తర్వాతా మరో ఆఫ్రికా దేశమైన సెనెగల్ జట్టులో 39.4శాతం మంది ఆటగాళ్లు.. యూరప్ దేశమైన పోర్చుగల్‌లో 32.1శాతం ఆటగాళ్లు ఇతర దేశాలకు చెందినవారే కావడం గమనార్హం. ఇక బ్రెజిల్, జర్మనీ, మెక్సికోలతో పాటు కొన్ని జట్లలో మాత్రమే ఇలా వలస ఆటగాళ్లు లేరు.
రోనాల్డో సైతం..
ఇక రీజినల్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌లను పరిశీలిస్తే కాన్ఫడరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్‌బాల్(సీఏఎఫ్)లో అత్యధికంగా వలస ఆటగాళ్లు ఉండగా.. యూరోపియన్ అసోసియేషన్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఇక నేషనల్ లీగ్స్‌ల్లో చాలా పేరున్న ఆటగాళ్లు సైతం ఇతర దేశాల లీగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్రిస్టియన్ రొనాల్డో సైతం లీగ్స్‌లో పాల్గొంటున్నాడు. పోర్చుగల్‌లో పుట్టి.. ఆదేశానికే ప్రాతినిథ్యం వహించే రొనాల్డో.. నేషనల్ లీగ్స్‌లో మాత్రం ఇంగ్లీష్, స్పానిష్ జట్లకు ప్రాతినిథ్య వహించాడు. గత తొమ్మిదేళ్లుగా రియల్ మాడ్రిడ్ క్లబ్(స్పెయిన్) తరపున ఆడుతున్న రొనాల్డోను తాజాగా ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ యువెంటస్ దక్కించుకున్న విషయం తెలసిందే. ఈజిప్టుకు చెందిన మహ్మద్ సలహ్ సైతం ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు. అంతేగాకుండా ఫ్రొఫెషనల్ ఫుట్‌బాలర్స్ అసోసియేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న తొలి ఈజిప్టియన్‌గా అతను గుర్తింపు పొందాడు.
జాత్యహంకార దాడులు..
ఇతర దేశాల తరపున ఆడుతున్నా.. ఆటనే ప్రాణంగా భావించే ఆటగాళ్లు విజయం కోసం ఎంతో శ్రమిస్తుంటారు. అయితే అనుకోకుండా ఆ జట్టు ఓడితే మాత్రమే అభిమానులు టార్గెట్ చేసెది వలస ఆటగాళ్లనే. ఇది మైగ్రెంట్ ఆటగాళ్లకు ఇబ్బందిగా మారింది. ఇలా స్విడిష్ మిడ్ ఫీల్డర్ జిమ్మీ డుర్మాజ్ జాత్యహంకర దాడులను ఎదుర్కొన్నాడు. జర్మనీకి ఫ్రికిక్ లభించే తప్పిదం చేసి తమ జట్టు ఓటమికి కారణం కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు దుమ్మెత్తి పోశారు. అస్సిరియన్ దంపతులకు జన్మించిన డుర్మాజ్ ఈ విమర్శలకు ఘటుగానే సమాధానమిచ్చాడు. ‘విమర్శలకు కూడా ఓ హద్దు ఉంటుంది. నన్ను అసభ్య పదజాలంతో తిట్టినా పర్లేదు. కానీ ఇంతటితో ఆగకుండా నాకుటుంబాన్ని, నా పిల్లలను, తల్లితండ్రులను తిట్టడం ఏమిటి’ అని గట్టిగానే బదులిచ్చాడు. ఇక డుర్మాజ్‌కు స్విడిష్ ఫుట్‌బాల్ అసోసియేషన్ సైతం మద్దతుగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment