బ్రిడ్జ్‌టౌన్: ఇంగ్లండ్ విజయ లక్ష్యం 361 పరుగులు... ఛేదనలో ఇంత భారీ స్కోరు సాధించడం దాదాపుగా అసాధ్యం అనిపించిన చోట మోర్గాన్ సేన సత్తా చాటింది. రాబోయే వరల్డ్ కప్‌లో అసలైన ఫేవరెట్‌గా కనిపిస్తున్న ఆ జట్టు మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి తన పదును చూపించింది. బుధవారం రాత్రి జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (129 బంతుల్లో 135; 3 ఫోర్లు, 15 సిక్సర్లు), షై హోప్ (65 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. అనంతరం ఇంగ్లండ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 364 పరుగులు సాధించింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జేసన్ రాయ్ (85 బంతుల్లో 123; 15 ఫోర్లు, 3 సిక్సర్లు), జో రూట్ (97 బంతుల్లో 102; 9 ఫోర్లు) సెంచరీలు సాధించి తమ జట్టును గెలిపించారు. రాయ్ జోరు ముందు గేల్ చేసిన శతకం మసకబారిపోయింది. సునాయాస క్యాచ్ వదిలేసి గేల్ సెంచరీకి కారణమైన రాయ్ బ్యాటింగ్‌తో తన తప్పు దిద్దుకున్నాడు. ముందుగా రాయ్, బెయిర్ స్టో (34) తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలో 91 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు శుభారంభం అందించారు. ఆ తర్వాత రూట్... రెండో వికెట్‌కు రాయ్‌తో 114 పరుగులు, మూడో వికెట్‌కు మోర్గాన్ (51 బంతుల్లో 65; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)తో 116 పరుగులు జోడించి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. ఈ క్రమంలో రూట్ వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు. రాయ్, రూట్ ఇచ్చిన చెరో రెండు క్యాచ్‌లు వదిలేసిన విండీస్ ఫీల్డర్లు ప్రత్యర్థికి తమ వంతు సాయం అందించారు. ఐదు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలో నిలవగా, నేడు ఇదే మైదానంలో రెండో వన్డే జరుగుతుంది.
► 1తమ వన్డే చరిత్రలో ఇంగ్లండ్ ఛేదించిన అత్యధిక స్కోరు ఇదే. ఓవరాల్‌గా ఇదే మూడో అత్యుత్తమ ఛేదన. దక్షిణాఫ్రికా రెండు సార్లు (438/9 – 372/6) ఆసీస్‌పైనే ఇంతకంటే పెద్ద లక్ష్యాలను అధిగమించింది.
► 23వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో సిక్సర్ల సంఖ్య. గతంలో న్యూజిలాండ్ (22) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును విండీస్ అధిగమించింది.
Comments
Please login to add a commentAdd a comment