
ఒక్క రాష్ట్రం నుంచే అన్ని పేర్లు సిఫార్సు చేస్తారా?
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలోని అర్జున్ అవార్డులకు నియమించబడ్డ కమిటీ చేసిన సిఫార్సులపై వివాదం చెలరేగుతోంది. అత్యున్నత క్రీడాకారులను మాత్రమే ఖేల్ రత్న ఎంపిక చేయాలని కపిల్ కమిటీ సిఫార్సుచేసినా.. ఒక్క రాష్ట్రం నుంచి ఐదుగురు క్రీడాకారులను అర్జున అవార్డుకు సిఫార్సు చేయడం కాస్తా విమర్శలకు తావిస్తోంది. 15 మందిని అర్జున అవార్డులకు సిఫార్సు చేస్తే.. అందులో అధికశాతం మందిని ఒక్క కేరళ రాష్ట్రం నుంచే ఎంపిక చేశారని హాకీ సెక్రటరీ జనరల్ నరీందర్ బత్రా ప్రశ్నించారు. ఆ ఎంపిక ఎలా జరిగిందో చెప్పాలని కపిల్ కమిటీని నిలదీశారు. తాము హాకీ నుంచి పంపిన ఏడుగురు ఆటగాళ్ల పేర్లలో ఏ ఒక్కరిని అర్జునకు సిఫార్సు చేయలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కపిల్ కమిటీలో ఉన్న మాజీ హాకీ ఆటగాడు అనుపమ్ గులాటీ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమని బత్రా తెలిపారు.
అయితే గత నాలుగేళ్ల నుంచి హాకీలో సరైన విజయాలు లేకపోవడంతో ఆటగాళ్ల పేర్లను కమిటీ ముందు పెట్టలేదని గులాటీ చెప్పడం సరైన విధానం కాదన్నారు. హాకీకి సంబంధించి ఆటగాళ్లను ఎంపిక చేసి వారికి తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని బత్రా అభిప్రాయపడ్డారు. గతంలో గంట కంటే ఎక్కువ సేపు కమిటీ సమావేశం అయిన దాఖలు లేకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఈసారి ఐదు గంటలకు పైగా జరిగిన సమావేశంలో తీవ్ర తర్జన భర్జనల అనంతరం అర్జున అవార్డులకు క్రీడాకారులను సిఫారుసు చేసింది. అయితే రాజీవ్ ఖేల్ రత్నకు మాత్రం తాజా కమిటీలో ఎవరి పేరును సిఫారుసు చేయకపోవడం గమనార్హం. ఈ అవార్డును అత్యున్నత క్రీడాకారులకే ఇవ్వాలని కపిల్ నేతృత్వంలోని కమిటీ సూచించినట్లు సమాచారం.