
హాకీ బాధ్యత ఇక హెచ్‌ఐదే
జాతీయ క్రీడ హాకీని నడిపించే పూర్తి బాధ్యతను ప్రభుత్వం హాకీ ఇండియా (హెచ్‌ఐ)కే కట్టబెట్టింది. ఈ మేరకు హెచ్‌ఐకి జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్) హోదాను కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
భారత హాకీపై పెత్తనం కోసం అంతర్గత కలహాలు చోటుచేసుకోవడం, ప్రభుత్వ నిబంధనల్ని పాటించని కారణంగా 2012లో హెచ్‌ఐ గుర్తింపును క్రీడా మంత్రిత్వశాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో భారత హాకీ ప్రతిష్టకు, ఆటగాళ్ల ప్రయోజనాలకు భంగం వాటిల్లరాదని భావిస్తూ దేశంలో పురుషుల, మహిళల హాకీ బాధ్యతను హెచ్‌ఐకే అప్పగించాలని నిర్ణయించింది.
ఈ మేరకు హాకీ ఇండియాకు పూర్తి గుర్తింపు కల్పిస్తున్నట్లు పేర్కొంటూ హెచ్‌ఐ సెక్రటరీ జనరల్ నరీందర్ బాత్రాకు ప్రభుత్వ కార్యదర్శి ఏకే పాత్రో లేఖ రాశారు. భారత క్రీడా నియమావళికి అనుగుణంగా నడచుకోవాల్సిందిగా హెచ్‌ఐకి సూచించారు.