Rani Rampal: మకుటం లేని మహారాణి | Rani Rampal bids farewell to hockey | Sakshi
Sakshi News home page

Rani Rampal: మకుటం లేని మహారాణి

Published Fri, Oct 25 2024 4:05 AM | Last Updated on Fri, Oct 25 2024 10:20 AM

Rani Rampal bids farewell to hockey

హాకీకి రాణి రాంపాల్‌ వీడ్కోలు

మహిళల హాకీకి వన్నె తెచ్చిన భారత స్టార్‌ ఫార్వర్డ్‌

14 ఏళ్లకే అరంగేట్రం

254 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం

205 గోల్స్‌తో తనదైన ముద్ర

రాణి సారథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టు

భారత పురుషుల హాకీ జట్టుకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. దిగ్గజాలూ ఉన్నారు. కానీ మహిళల హాకీకి ఆదరణే అంతంత మాత్రం! ఇలాంటి ఆటలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన రాణి రాంపాల్‌... తన ఆటతీరుతో నిజంగా ‘రాణి’గా ఎదిగింది. 

బాల్యంలో పేదరికం వెంటాడినా... పెద్దయ్యాక ఆటలో గోల్స్‌ వేటలో పడింది. మేటి ఫార్వర్డ్‌ ప్లేయర్‌గా, తదనంతరం కెప్టెన్  గా జట్టును నడిపించింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె సారథ్యంలోని భారత మహిళల జట్టు త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచింది.   

న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌ తన 16 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ఆమె ప్రకటించింది. మహిళల జట్టులో అరుదైన మేటి క్రీడాకారిణిల్లో ఆమె ఒకరు. ‘పారిస్‌’ కంటే ముందు జరిగిన టోక్యో విశ్వక్రీడల్లో భారత మహిళల జట్టుకు పతకం రేసులో నిలిచే సత్తా ఉందని తన సారథ్యంతో చాటి చెప్పిన స్టార్‌ ఫార్వర్డ్‌ రాణి. 

దురదృష్టవశాత్తూ కాంస్య పతక పోరులో రాణి బృందం ఓడి చివరకు నాలుగో స్థానంలో నిలిచింది. భారత మహిళల హాకీ చరిత్రలో ఒలింపిక్స్‌ పతకం లేకపోవచ్చేమో గానీ... నాలుగో స్థానంతో దేశంలో మహిళల హాకీ భవిష్యత్తుకు బంగారు బాట వేసింది.  

ఇదీ నేపథ్యం... 
హరియాణాలోని మారుమూల పల్లెకు చెందిన నిరుపేద కుటుంబ నేపథ్యం రాణి రాంపాల్‌ది. తండ్రి రాంపాల్‌ రోజూ బండిలాగితే వచ్చే అరకొర డబ్బులతో వీరి కుటుంబం పూట గడిచేది. అలాంటి చిన్నారి ఓ హాకీ స్టిక్‌ చూడగలదేమో కానీ కొనుక్కోలేదు. బాల్యంలో సరైన తిండిలేక పోషకాహార లోపంతో కనబడే రాణిని చూసిన జిల్లాస్థాయి కోచ్‌ ఆమెకు కోచింగ్‌ నిరాకరించాడు. కానీ ఆ బాలిక మాత్రం మక్కువ పెంచుకున్న హాకీ ఆటపై మనసు లగ్నం చేసింది. 

విరిగిపోతే పడేసిన ఓ హాకీ స్టిక్‌తో అదేపనిగా ప్రాక్టీస్‌ చేసింది. అలా మెల్లిగా స్థానిక జట్టులోకి వచ్చి... ఎన్నో ఒడిదొడుకులు, పేదరికపు కష్టాలు, ఆటుపోట్లకు ఎదురీది ఎట్టకేలకు 14 ఏళ్ల వయసులో భారత జట్టులోకి ఎంపికై అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఆ తర్వాత ఏళ్లు గడుస్తున్న కొద్దీ పేరుకు తగ్గట్టే భారత మహిళల హాకీ జట్టుకు ‘రాణి’ అయ్యింది. 

ఫీల్డ్‌లో చక్కని సమయస్ఫూర్తి, పాస్‌లలో చురుకుదనం, ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ వద్ద కొరకరాని ఫార్వర్డ్‌గా ఎదిగింది. తదనంతరం జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాక భారత్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆసియా క్రీడలు, ప్రపంచకప్, ఒలింపిక్స్‌లో మహిళల జట్టుకు అద్భుతం చేసే సత్తా ఉందని కెప్టెన్ గా నిరూపించింది. తాజాగా 29 ఏళ్ల వయసులో రిటైర్మెంట్‌ ప్రకటించింది.
 
కెరీర్‌లో ఘనతలు 
స్టార్‌ ఫార్వర్డ్‌ రాణి సారథ్యంలోనే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో స్థానం లభించింది. 2018 మహిళల ప్రపంచకప్‌ హాకీ (లండన్‌)లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. అదే ఏడాది ఆసియా క్రీడల్లో రాణి జట్టు రజత పతకం గెలిచింది. చిరు ప్రాయంలో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన ఆమె 254 అంతర్జాతీయ మ్యాచ్‌లాడి 205 గోల్స్‌ చేసింది. 

2020లో ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డును ప్రదానం చేసింది. అదే ఏడాది నాలుగో పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ కూడా ఆమె కీర్తి కిరీటంలో చేరింది. ఆమె 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సాధించిన మైలురాళ్లకు ఘనమైన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించుకున్న హాకీ ఇండియా ఆమె జెర్సీ నంబర్‌ 28కి రిటైర్మెంట్‌ ఇచ్చింది. 

గురువారం న్యూఢిల్లీలో భారత్, జర్మనీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ అనంతరం రాణిని కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా సన్మానించి రూ. 10 లక్షలు నగదు పురస్కారం అందజేశారు. 

నాకే ఆశ్చర్యమనిపిస్తోంది 
నా క్రీడా ప్రయాణం చూసుకుంటే నాకే ఆశ్చర్యమేస్తుంది. ఇన్నేళ్లు భారత్‌కు ఆడతానని ఏనాడు అనుకోలేదు. బీదరికంలో కష్టాలు చూసిన ఆ కళ్లతోనే ఆటపై దృష్టి పెట్టాను. అనుకున్నది సాధించాను. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఏనాడూ నిరాశ చెందలేదు. భారత్‌కు ఆడటంపట్ల ఎంతో గర్విస్తున్నాను. 

నిజం చెప్పాలంటే నేను 254 మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాననని గానీ, 200 పైచిలుకు గోల్స్‌ సాధిస్తానని గానీ ఎప్పుడు అనుకోలేదు. బాల్యంలో నాన్న ఆ తర్వాత కుటుంబం, నా కోచ్‌ బల్‌దేవ్‌ సింగ్‌ నా లైఫ్‌ను తీర్చిదిద్దారు. బల్‌దేవ్‌లాంటి కోచ్, టీచర్‌ దొరకడమే నా అదృష్టం. ఆటలో నైపుణ్యం నేర్పిన అతను జీవితానికి సరిపడా పాఠాలూ చెప్పారు. రిటైర్మెంట్‌ నిర్ణయం కఠినమైనా తప్పదు. దీనికిదే సరైన సమయమని భావిస్తున్నా. 

భారత సబ్‌ జూనియర్‌ జట్టుకు ఇటీవల కోచ్‌గా నన్ను నియమించారు. త్వరలో జరిగే హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో హరియాణా–పంజాబ్‌కు చెందిన సూర్మా హాకీ మహిళల జట్టుకు కోచ్, మెంటార్‌గా సరికొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టనున్నాను. ఒలింపిక్స్‌లో మా జట్టు పోడియంలో నిలువలేదు... కానీ భవిష్యత్తులో తప్పకుండా పతకాలు సాధిస్తుంది. –రాణి రాంపాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement