ఈసారి ఏం చేస్తారో!
నేడు ఇంగ్లండ్‌తో భారత్ పోరు
హాకీ ప్రపంచకప్
రాత్రి గం. 7.30 నుంచి
టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
ది హేగ్ (నెదర్లాండ్స్): బెల్జియంతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో చివరి 15 సెకన్లలో గోల్ సమర్పించుకొని ఓటమి పాలైన భారత్‌కు సోమవారం మరో పరీక్ష ఎదురుకానుంది. హాకీ ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో పోటీపడనున్న భారత్‌కు మంచి ఫలితం రావాలంటే అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. బెల్జియంపై ఒకదశలో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఆ తర్వాత రెండు గోల్స్ ఇచ్చి ఓటమి పాలైంది. రెండో మ్యాచ్‌లోనైనా రక్షణపంక్తిలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే టీమిండియా ఈ టోర్నీలో నిలబడే అవకాశాలుంటాయి. మరో పరాజయం ఎదురైతే మాత్రం భారత్ కోలుకోవడం కష్టమే. ‘ఎలా ఆడామన్నది, ఎలా ముగించామన్నది ముఖ్యమే కానీ చివరికొచ్చేసరికి స్కోరునే చూస్తారు.
బెల్జియంతో బాగా ఆడినా చివరి 30 సెకన్లలో తారుమారైంది’ అని భారత చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ తెలిపారు. ‘తొలి మ్యాచ్‌లో మెరుగ్గా ఆడినా కీలకదశలో తప్పిదాలు చేశాం. అయితే ఈ మ్యాచ్ ద్వారా లభించిన సానుకూలాంశాలతో ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమవుతాం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉన్నా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోం. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం’ అని భారత కెప్టెన్ సర్దార్ సింగ్ తెలిపాడు.