లండన్: 44 ఏళ్ల క్రితం తొలిసారి మహిళల హాకీ ప్రపంచకప్ నిర్వహించినపుడు భారత జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మరో ఐదుసార్లు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొన్నప్పటికీ టీమిండియా ఏనాడూ మళ్లీ సెమీఫైనల్‌కు చేరుకోలేదు. అయితే కొంతకాలంగా భారత మహిళల హాకీ జట్టు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తూ తమ ఉనికిని చాటుకుంటోంది. గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం నెగ్గి తమ సత్తా చాటుకుంది. అదే జోరును ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కొనసాగించాలని... కనీసం టాప్–8లో నిలవాలనే పట్టుదలతో ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగుతోంది. శనివారం మొదలయ్యే ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటున్నాయి.
మొత్తం జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక ఆయా గ్రూప్‌ల్లో అగ్రస్థానం పొందిన నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందుతాయి. ఆయా గ్రూప్‌ల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు మరో నాలుగు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ల కోసం పోటీపడతాయి. గ్రూప్ ‘బి’లో భారత్‌తోపాటు ఆతిథ్య ఇంగ్లండ్, ఐర్లాండ్, అమెరికా జట్లు ఉన్నాయి. శనివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఆడనున్న భారత్... ఆ తర్వాత 26న ఐర్లాండ్‌తో... 29న అమెరికాతో తలపడుతుంది. ‘ఒత్తిడంతా ఇంగ్లండ్‌పైనే ఉంటుంది. సొంతగడ్డపై ఆడుతున్న అంశం వారికి అనుకూలం. అయితే ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో ఇంగ్లండ్‌ను మేము ఓడించిన సంగతి మర్చిపోవద్దు. ఈసారి అలాంటి ఫలితమే సాధిస్తామన్న నమ్మకం ఉంది’ అని భారత మహిళల జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ వ్యాఖ్యానించింది. ఈ ప్రపంచకప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇతిమరపు రజని భారత్ తరఫున రెండో గోల్‌కీపర్‌గా వ్యవహరించనుంది.
ప్రపంచకప్‌లో భారత్ ప్రదర్శన
ఏడాది వేదిక స్థానం
1974 ఫ్రాన్స్ 4
1978 స్పెయిన్ 7
1983 మలేసియా 11
1998 నెదర్లాండ్స్ 12
2006 స్పెయిన్ 11
2010 అర్జెంటీనా 9
జట్ల వివరాలు
గ్రూప్ ‘ఎ’: చైనా, ఇటలీ, కొరియా, నెదర్లాండ్స్
గ్రూప్ ‘బి’: భారత్, ఇంగ్లండ్, ఐర్లాండ్, అమెరికా
గ్రూప్ ‘సి’: అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, జర్మనీ
గ్రూప్ ‘డి’: ఆస్ట్రేలియా, బెల్జియం, జపాన్, న్యూజిలాండ్
Comments
Please login to add a commentAdd a comment