భారత్... ఈసారైనా!
టాప్-6 లక్ష్యంగా బరిలోకి
నేటి నుంచి హాకీ ప్రపంచకప్
బెల్జియంతో తొలిపోరు
ది హేగ్ (నెదర్లాండ్స్): జాతీయ క్రీడకు పునర్ వైభవం తెచ్చేందుకు భారత హాకీ జట్టుకు మరో అవకాశం లభించింది. శనివారం మొదలయ్యే ప్రపంచకప్‌లో టాప్-6లో నిలువడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగనుంది. అయితే ఇటీవల కాలంలో భారత హాకీ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే... టోర్నీ ‘డ్రా’ వివరాలను పరిశీలిస్తే భారత్ తమ లక్ష్యాన్ని అందుకోవడం అంత సులువుకాదని తెలుస్తోంది.
తొలి మ్యాచ్‌లో బెల్జియంతో పోటీపడనున్న సర్దార్ సింగ్ బృందం చివరి క్షణం వరకు అప్రమత్తంగా ఉంటేనే అనుకూలమైన ఫలితం వస్తుంది. గత మూడేళ్ల కాలంలో బెల్జియంతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ కేవలం ఒక మ్యాచ్‌లో నెగ్గి, మిగతా మూడింటిలో ఓటమిపాలైంది. భారత్ ఉన్న గ్రూప్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, స్పెయిన్, మలేసియా జట్లున్నాయి. మలేసియాను మినహాయిస్తే మిగతా జట్లపై భారత్ నెగ్గాలన్నా, ‘డ్రా’ చేసుకోవాలన్నా విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన 12 ప్రపంచకప్‌లలో పాల్గొన్న భారత్ 1975లో విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత ఏ ప్రపంచకప్‌లోనూ భారత్ సెమీఫైనల్ చేరుకోలేకపోయింది. 1994లో అత్యుత్తమంగా ఐదో స్థానాన్ని సంపాదించింది.
స్వదేశంలో నాలుగేళ్ల క్రితం జరిగిన ప్రపంచకప్‌లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆ ప్రపంచకప్‌లో ఆడిన నలుగురు ఆటగాళ్లు మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నారు. ‘తొలి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
విజయంతో బోణీ చేస్తామని గట్టి నమ్మకంతో ఉన్నాం. బెల్జియం స్టార్ డ్రాగ్ ఫ్లికర్ టిమ్ బూన్‌ను నిలువరిస్తే భారత్‌కు సగం విజయం దక్కినట్టే’ అని భారత కెప్టెన్ సర్దార్ సింగ్ అన్నాడు. ‘టాప్-6లో నిలువాలనే లక్ష్యంతో ఈ మెగా ఈవెంట్‌లో పోటీపడుతున్నాం. దానికంటే మంచి ప్రదర్శన చేస్తే అది అద్భుతం కాకపోయినా మా కల నిజమైందనే అనుకుంటాం’ అని చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ అన్నారు.
క్రికెటర్ల మద్దతు
ప్రపంచకప్‌లో భారత్ రాణించాలని కోరుతూ ‘ట్విట్టర్’ ద్వారా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. కొన్నిరోజుల క్రితం ధ్యాన్‌చంద్ స్టేడియంలో భారత జట్టు సభ్యులను సచిన్ టెండూల్కర్ కలిసి తన అనుభవాలను పంచుకున్నాడు.
జట్ల వివరాలు
గ్రూప్ ‘ఎ’: భారత్, ఆస్ట్రేలియా, బెల్జియం, ఇంగ్లండ్, మలేసియా, స్పెయిన్
గ్రూప్ ‘బి’: నెదర్లాండ్స్, జర్మనీ, న్యూజిలాండ్, కొరియా, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా
భారత్ మ్యాచ్‌ల
షెడ్యూల్ (భారత కాలమానం)
మే 31: బెల్జియంతో రా. గం. 7.30 నుంచి
జూన్ 2: ఇంగ్లండ్‌తో రా. గం. 7.30 నుంచి
జూన్ 5: స్పెయిన్‌తో రా. గం. 9.00 నుంచి
జూన్ 7: మలేసియాతో సా. గం. 6.00 నుంచి
జూన్ 9: ఆస్ట్రేలియాతో సా. గం. 4.30 నుంచి
నోట్: అన్ని మ్యాచ్‌లు టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
ప్రపంచ కప్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు మొత్తం 85 మ్యాచ్‌లు ఆడింది. 37 మ్యాచ్‌లో గెలిచి, 38 మ్యాచ్‌లో ఓడిపోయింది. 10 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఓవరాల్‌గా భారత్ తరఫున ముగ్గురు క్రీడాకారులు (మొహిందర్ సింగ్, రాజేందర్ సింగ్, ముకేశ్ కుమార్) హ్యాట్రిక్ నమోదు చేశారు.