హోల్డర్‌కు విండీస్ వన్డే జట్టు పగ్గాలు
జమైకా: వెస్టిండీస్ వన్డే క్రికెట్ జట్టుకు మరో కొత్త కెప్టెన్ వచ్చాడు. గతేడాది డారెన్ స్యామీ స్థానంలో కెప్టెన్‌గా నియమితుడైన డారెన్ బ్రేవోను తప్పిస్తూ అతని స్థానంలో 23 ఏళ్ల యువ పేస్ బౌలర్ జాసన్ హోల్డర్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు వన్డేల సిరీస్‌కు హోల్డర్ సారథ్యంలో వెస్టిండీస్ ఆడుతుందని విండీస్ క్రికెట్ బోర్డు సెలెక్షన్ కమిటీ చైర్మన్ క్లయివ్ లాయిడ్ తెలిపారు.
దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొనే విండీస్ జట్టులో డారెన్ బ్రేవోతోపాటు స్యామీ, పొలార్డ్‌లకు స్థానం దక్కలేదు. గతేడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేసిన హోల్డర్ 21 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తీశాడు. విండీస్ క్రికెట్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే హోల్డర్‌ను కెప్టెన్‌గా నియమించామని లాయిడ్ వివరించారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ ఎనిమిదో స్థానంలో ఉంది.