శుక్లా సెకండ్ ఇన్నింగ్స్
బెంగాల్ మంత్రిగా ప్రమాణం
న్యూఢిల్లీ: లక్ష్మీ రతన్ శుక్లా.. 90వ దశకం చివర్లో భారత వన్డే క్రికెట్ జట్టులో సభ్యుడు. దాదాపు 18 సంవత్సరాలు బెంగాల్ రంజీ క్రికెటర్. కెప్టెన్‌గా రంజీట్రోఫీ సాధించిన ఆటగాడు. ఈ సీజన్లోనూ రంజీ మ్యాచ్‌లు ఆడి... ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన శుక్లా.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 35 ఏళ్ల శుక్లా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశాడు. రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన మమతా బెనర్జీ క్యాబినెట్లో తనే అందరికంటే పిన్న వయస్కుడు. ఇంకా శాఖను కేటాయించకపోయినప్పటికీ శుక్లాకు క్రీడా శాఖ దక్కే అవకాశాలున్నాయి. మమతా బెనర్జీ ఆహ్వానం మేరకు రాజకీయాల్లో చేరిన శుక్లా ఉత్తర హౌరా నియోజకవర్గం నుంచి నటి రూపా గంగూలీపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక గతంతో పనిలేకుండా భవిష్యత్‌పై దృష్టి సారిస్తానని చెబుతున్నాడు.
‘నేటి నుంచి నా పాత రోజులను మర్చిపోవాలనుకుంటున్నాను. 1999 అనంతరం వన్డే జట్టులోకి ఎందుకు ఎంపిక కాలేదు? నా రిటైర్మెంట్కు కారణాలేమిటి? అనేవి ఇక అనవసరం. ఇది నా రెండో ఇన్నింగ్స్. నిష్కల్మషంగా ప్రజా అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటున్నాను. దీదీ అభ్యర్థిగా నన్ను హౌరా ప్రజలు ఆశీర్వదించారు. రాజకీయాలు విభిన్న పిచ్‌పై ఆడాల్సిన గేమ్. నేను దీనికి సిద్ధంగా ఉన్నాను. దీదీ ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తాను’ అని శుక్లా తెలిపాడు.
కెరీర్లో ఒడిదుడుకులు: 1997-98 సీజన్లో 16 ఏళ్ల శుక్లా తొలిసారిగా రంజీ ట్రోఫీ ఆడాడు. ఆ తర్వాత సీజన్లో చూపిన ప్రతిభ ఆధారంగా సెలక్టర్ల దృష్టిలో పడిన తను వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అయితే పెద్దగా రాణించకపోవడంతో ఆ తర్వాత నిరాదరణకు గురయ్యాడు. ఆడిన 3 వన్డేల్లో 18 పరుగులు చేసి ఓ వికెట్ తీశాడు. అలాగే 137 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 6,217 పరుగులు చేయగా ఇందులో 9 సెంచరీలున్నాయి. మరోవైపు ఐపీఎల్లో కేకేఆర్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో పాటు గతేడాది సన్‌రైజర్స్ జట్టులోనూ ఉన్నాడు.