
టీమిండియా ఎలా రిలాక్స్ అయ్యిందంటే..
హరారే: జింబాబ్వే పర్యటనలో వన్డే సిరీస్ను వైట్వాష్ చేసిన టీమిండియా ఆ తరువాత తొలి టీ 20లో మాత్రం అన్యూహ్యంగా ఓటమి పాలైంది. దీంతో ఒక్కసారిగా టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. మరోవైపు ఆ పరాజయం యువ ఆటగాళ్లని తీవ్రంగా నిరుత్సాహానికి గురి చేసింది. అయితే తీవ్ర ఒత్తిడిలో ఉన్న యువ జట్టు రెండో టీ 20లో అద్భుతమైన ఆట తీరుతో అదరగొట్టింది. జింబాబ్వేపై సమష్టిగా పోరాడి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే తొలి టీ 20 ఓటమి తరువాత లభించిన ఈ ఘన విజయానికి హాలీవుడ్ మూవీనే కారణమట. ఆ సినిమాతో లభించిన రిలాక్స్తోనే రెండో టీ 20లో పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించామని ఓపెనర్ మన్ దీప్ సింగ్ అంటున్నాడు.
'తొలి టీ 20 తరువాత చాలా ఒత్తిడికి గురయ్యాం. ఆ ఓటమి షాక్ నుంచి ముందు బయటపడాలని నిర్ణయించుకున్నాం. అప్పటికే అదే పిచ్ పై చాలా మ్యాచ్ లు ఆడినా మొదటి టీ 20లో విజయానికి దగ్గరకొచ్చి ఓడిపోయాం. ఆ ఓటమిపై కొన్ని కీలక విషయాలు చర్చించిన తరువాత హాలీవుడ్ మూవీ 'నౌ యూ సీ మీ-2'సినిమాకు వెళ్లాం. ఆ సినిమాను ధోనితో పాటు కొంతమంది క్రికెటర్లు కలిసి వీక్షించాం. అదే తీవ్ర ఒత్తిడిలో ఉన్న మాకు ఉపశమనం కల్గించింది' అని అరంగేట్రం టీ 20లో హాఫ్ సెంచరీ సాధించిన మన్ దీప్ సింగ్ స్సష్టం చేశాడు.