
ఈసారైనా శ్రీ‘కాంతు’లీనేనా!
హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
కౌలూన్ (హాంకాంగ్): కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతోన్న భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్... సీజన్ చివరి సూపర్ సిరీస్ టోర్నమెంట్ హాంకాంగ్ ఓపెన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ తియాన్ హువీ (చైనా)తో ప్రపంచ ఐదో ర్యాంకర్ శ్రీకాంత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 0-4తో వెనుకంజలో ఉన్నాడు. తియాన్ హువీతో ఈ ఏడాది ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ శ్రీకాంత్‌కు పరాజయమే ఎదురైంది. కనీసం ఐదో సారైనా శ్రీకాంత్‌కు విజయం దక్కుతుందో లేదో వేచి చూడాలి.
ఈ ఏడాది ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో టైటిల్ సాధించాక శ్రీకాంత్ ఆటతీరు గాడి తప్పింది. తాను బరిలోకి దిగిన 13 టోర్నమెంట్‌లలో అతను క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయాడు. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో గాయం కారణంగా సైనా నెహ్వాల్ ఈ టోర్నమెంట్ నుంచి చివరి నిమిషంలో వైదొలిగింది. దాంతో అందరి దృష్టి పీవీ సింధుపైనే ఉంది. తొలి రౌండ్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో ఆడుతుంది.