హాంకాంగ్: ప్రపంచ చాంపియన్ పూసర్ల వెంకట సింధు మళ్లీ నిరాశపరిచింది. హాంకాంగ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్‌లో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... హెచ్.ఎస్.ప్రణయ్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ సింధు 18–21, 21–11, 16–21తో తనకంటే దిగువ ర్యాంకులో ఉన్న బుసానన్ ఒంగ్‌బామ్రుంగ్‌ఫాన్ (థాయ్‌లాండ్) చేతిలో కంగుతింది. పురుషుల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–11, 15–21, 21–19తో భారత సహచరుడు సౌరభ్ వర్మపై గెలుపొందాడు. మిగతా మ్యాచ్‌ల్లో హెచ్.ఎస్.ప్రణయ్ 12–21, 19–21తో ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూడగా, రెండో సీడ్ చౌతియెన్ చెన్ (చైనీస్ తైపీ) 12–21, 23–21, 21–10తో పారుపల్లి కశ్యప్‌పై చెమటోడ్చి నెగ్గాడు. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట 19–21, 12–21తో నాలుగో సీడ్ యుత వతనబె–అరిస హిగషినొ జోడీ చేతిలో కంగుతింది.
Comments
Please login to add a commentAdd a comment