డివిలియర్స్ అరుదైన మైలురాయి
బార్బోడాస్:దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ముక్కోణపు సిరీస్లో ఆదివారం రాత్రి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా డివిలియర్స్ 200వ వన్డే మార్కును చేరాడు. తద్వారా దక్షిణాఫ్రికా తరపున ఆ ఘనతను పూర్తి చేసుకున్న ఆరో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతకుముందు 200 వన్డే మార్కును చేరిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో జాక్వస్ కల్లిస్, హెర్ష్లీ గిబ్బ్, జాంటీ రోడ్స్, మార్క్ బౌచర్, షాన్ పొలాక్ లు మాత్రమే ఉన్నారు. ఇదిలా ఉండగా డివిలియర్స్ రెండొందల వన్డే వర్షార్పణం కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగిన సమయంలో భారీ వర్షం పడటంతో మ్యాచ్ను నిలిపివేశారు. వర్షం ఎంతకీ విరామం ఇవ్వకపోవడంతో ఆ మ్యాచ్ ను రద్దు చేశారు.
ఇదిలా ఉండగా, గత నవంబర్లో భారత్ తో టెస్టు సిరీస్ సందర్భంగా బెంగళూరు మ్యాచ్ ద్వారా డివిలియర్స్ వంద టెస్టులను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ కూడా వర్షం కారణంగా డ్రా ముగిసింది. కేవలం ఒక రోజు ఆట మాత్రమే సాధ్యమైన ఆ టెస్టు మ్యాచ్లో డివిలియర్స్ 85 పరుగులు చేశాడు. ఇప్పటివరకూ డివిలియర్స్ 106 టెస్టులు ఆడితే, 205 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. కాగా, ఐదు వన్డేలు మాత్రం ఆఫ్రికా ఎలెవన్ తరపున డివిలియర్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా తరపున 200 వన్డేలు ఆడటం పట్ల డివిలియర్స్ హర్షం వ్యక్తం చేశాడు. ఇది తనకు లభించిన అరుదైన గౌరంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు.