బోల్ట్ 'పరుగు' వెనుక రహస్యం?
రియో డీ జనీరో: 'నాలో చురుకుదనం తగ్గింది. రేసును పూర్తి చేసే క్రమంలో సరైన ప్రదర్శన చేయలేదు. రేస్‌లో నా ప్రారంభం అంత గొప్పగా జరగలేదు. ఏ పెద్ద ఈవెంట్‌లోనూ ఈ సమయంలో పరుగెత్తిన అలవాటు నాకు లేదు. గాడిలో పడటానికి యత్నిస్తా. ' ఇవన్నీ రియో ఒలింపిక్స్లో వంద మీటర్ల పరుగు పందెంలో సెమీ ఫైనల్ కు అర్హత సాధించిన తరువాత బోల్డ్ చెప్పిన మాటలు.
తొలి రౌండ్ హీట్స్ పోటీల్లో భాగంగా 10.07 సెకన్లలో లక్ష్యం చేరి అగ్రస్థానంలో నిలిచినా బోల్ట్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే పతకం పోరుకు వచ్చేసరికి బోల్ట్ తనలోని చురుకుదనం తగ్గలేదని నిరూపించుకుని.. రియోలో తొలి స్వర్ణాన్ని అందుకున్నాడు. కేవలం 9.81 సెకన్లలో పురుషుల వందమీటర్ల ఫైనల్ పరుగుపందెన్ని పూర్తిచేసి.. వరుసగా మూడోసారి ఒలింపిక్స్ స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి స్ప్రింటర్ గా చరిత్ర సృష్టించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్ లలో పురుషుల వందమీటర్ల పరుగు పందెంలో బోల్ట్ స్వర్ణాలను సాధించగా.. ఆయా ఒలింపిక్స్లలో 200 మీటర్ల వ్యక్తిగత రేసులో, 4x100 జట్టు పరుగు పందెంలో ఆ స్పీడ్ స్టార్ పసిడి పతకాలను కైవసం చేసుకున్నాడు. అయితే.. బోల్ట్కు మాత్రమే ఇదెలా సాధ్యమైంది? అతను బుల్లెట్లా దూసుకెళ్లడం వెనక రహస్యమేంటి?
2008లో ఒలింపిక్స్లో పసిడి పండించడంతో మొదలుపెట్టి.. ఇప్పటి వరకూ ప్రపంచ ఛాంపియన్ షిప్, ఒలింపిక్స్.. ఆటేదైనా.. మెడల్ మాత్రం బోల్ట్ దే. మామూలుగా వేగంగా పరిగెత్తాలంటే.. కాళ్లు వేగంగా కదిలించాలి. కానీ బోల్ట్ మాత్రం వేరే చిట్కా పాటిస్తాడట. అగ్రశ్రేణి స్ప్రింటర్లు 100 మీటర్ల రేసును పూర్తి చేయడానికి 50 నుంచి 55 అంగలు ఉపయోగిస్తే.. ఈ జమైకా స్టార్ 40 అంగల లోపే రేసును పూర్తి చేస్తాడట. కొన్ని సందర్బాల్లో కేవలం 35 అంగల్లోనే ఆ రేసును పూర్తి చేయడమే బోల్ట్ ను మిగతావారి కంటే ముందంజలో నిలబెడుతుందట.
గతంలో బోల్ట్ వేగంపై పరిశోధన చేసిన అమెరికాకు చెందిన శాస్త్ర వేత్త డాక్టర్ ఎలెన్ ఈ విషయాలను వెల్లడించారు. అదే బోల్ట్ను మిగతావారి కంటే ముందు రేస్ పూర్తి చేసేందుకు సహాయపడుతుంది.అంతే కాదు.. సాధారణంగా అగ్రశ్రేణి రన్నర్ ప్రతి అంగలో భూమి మీద కాలు మోపే కాలం 0.12 సెకండ్లు కాగా.. బోల్ట్ కేవలం 0.8 సెండ్లు మాత్రమే నేల మీద కాలు పెడతాడు. మిగతా వారితో పోలిస్తే బోల్ట్ 10 నుంచి 15 శాతం ఎక్కువ సమయం గాలిలో ఉంటాడట. ఇవన్నీ బోల్డ్ రేసును వేగంగా పూర్తి చేయడానికి ప్రధాన కారణమని తేల్చారు.