ప్రణయ్దే యూఎస్ ఓపెన్
కాలిఫోర్నియా: యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీ లో భారత్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ విజేతగా నిలిచాడు. మరో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ తో తుది పోరులో ప్రణయ్ విజయం సాధించి టైటిల్ ను ఎగురేసుకుపోయాడు. తద్వారా తన కెరీర్లో మూడో గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ ను ప్రణయ్ సాధించాడు. దాదాపు గంటకుపైగా జరిగిన పోరులో ప్రణయ్ 21-15, 20-22, 20-12 తేడాతో కశ్యప్ పై గెలిచాడు.
తొలి గేమ్ ను గెలిచిన ప్రణయ్.. రెండో గేమ్ లో పోరాడి ఓడాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ లో ప్రణయ్ దాటిగా ఆడి కశ్యప్ కు షాకిచ్చాడు. గత ఏడాది స్విస్ ఓపెన్ గెలుచుకున్న తరువాత ప్రణయ్ ఓ అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కాగా, ఈ ఏడాది ఇద్దరు భారత ఆటగాళ్లు ఫైనల్ చేరడం రెండో సారి. సింగపూర్ ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్, సాయి ప్రణీత్లు తలపడిన సంగతి తెలిసిందే.