మెయిన్ ‘డ్రా’కు హుమేరా
చండీగఢ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఐటీఎఫ్ జూనియర్స్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. చండీగఢ్ లాన్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీ బాలికల చివరి రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ హుమేరా 5-7, 6-3, 7-5తో హర్లీన్ కౌర్ (చండీగఢ్)ను ఓడించింది. బాలుర విభాగంలోనూ టాప్ సీడ్ అలెక్స్ సోలెంకి 6-4, 6-1తో ఐదో సీడ్ సాగర్ బైన్సపై గెలుపొంది మెయిన్ డ్రాకు అర్హత పొందాడు.
మెయిన్ డ్రా మ్యాచ్‌లు నేటి (సోమవారం) నుంచి ఈనెల 7 వరకు జరుగుతాయి. ఇతర బాలుర మ్యాచ్‌ల్లో ఆర్. బొల్లిపల్లి 4-6, 7-5, 6-3తో అశుతోష్ తివారిపై, సుమిత్ పాల్ సింగ్ 6-3, 4-6, 6-4తో కృషన్ హుడాపై, అథర్వ శర్మ 6-0, 6-3తో ద్రోణ వాలియాపై గెలుపొందారు. బాలికల మ్యాచ్‌ల్లో శివాని మంజన్న 6-3, 6-1తో మిషా సూద్‌పై, యుబ్రాని బెనర్జీ 7-6 (7), 6-1తో దాదాసాహెబ్ చౌగ్లేపై, గౌరీ భాగియా 6-2, 6-3తో అంజలి మొగిలిపై విజయం సాధించారు.