అలాంటి వారు గౌరవాన్ని కోల్పోతారు
అలాంటి వారు గౌరవాన్ని కోల్పోతారు
Published Fri, Dec 11 2015 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM
మాజీలపై టెస్టు కెప్టెన్ కోహ్లి విమర్శ
న్యూఢిల్లీ: జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని మాజీ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెటర్లను విమర్శించడంపై భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ధ్వజమెత్తాడు. టెస్టు ఫార్మాట్‌లో నంబర్‌వన్‌గా ఉన్న దక్షిణాఫ్రికాపై 3-0తో సిరీస్ గెలిచినా ఇంకా విమర్శించడం శోచనీయమని అన్నాడు. తాము ఎలా ఆడి గెలిచామో కాకుండా పిచ్‌ల గురించి ఎక్కువగా చర్చ జరిగిందని తప్పుబట్టాడు. ‘సొంత ప్రయోజనాల కోసం ఆడిన కొందరు మాజీలు మా ఆటను విమర్శించడం గాయపరిచింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మాత్రమే ఆడిన వారికి అంతర్జాతీయ క్రికెటర్లను విమర్శించే హక్కు లేదు. ఇంట్లో కూర్చుని ఎలా ఆడాలో చెప్పడమేమిటి? మైదానంలో ఉన్న ఆటగాడికే ఆ పరిస్థితిపై అవగాహన ఉంటుంది. కొందరు మా మైండ్‌సెట్‌ను అర్థం చేసుకుని మాట్లాడారు. విలువైన సలహాలతో ఉపయోగపడ్డారు. కానీ కొందరు మాత్రం నెగెటివ్స్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నిజానికి వారిని చూస్తూ పెరిగిన నేను అలాంటి కామెంట్స్ చేసినపుడు గౌరవించాలని ఎలా అనిపిస్తుంది’ అని కోహ్లి ప్రశ్నించాడు.
నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-0తో నెగ్గినా కొందరు తమకు క్రెడిట్ ఇవ్వడం లేదని ఆరోపించాడు. సొంత గడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో తామెంత మంచి క్రికెట్ ఆడామో గుర్తు చేయకుండా లోపాలపై, పిచ్‌లపై దృష్టి పెట్టారని అన్నాడు. మాజీలతో పాటు మీడియా కూడా జట్టు ఆటగాళ్లపై విమర్శలు చేసిందని గుర్తు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలం కాగానే ఎందుకూ పనికిరానివాడిగా కథనాలు ప్రచురించడం సరికాదని హితవు పలికాడు. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా వాటిని చూసి నమ్ముతారని అన్నాడు. ఆసీస్, ఇతర దేశాల్లో పరిస్థితి ఇలా వుండదని, ఆటగాడు ఫామ్ కోల్పోయినా గతంలో ఎలా ఆడేవాడో.. ఎంత మంచి ఆటగాడో చర్చిస్తారని తెలిపాడు.
Advertisement
Advertisement