హైదరాబాద్ హాట్ హాట్‌గా... | Hyderabad Hot Shots team started | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ హాట్ హాట్‌గా...

Published Fri, Aug 16 2013 1:37 AM | Last Updated on Fri, Sep 7 2018 4:39 PM

Hyderabad Hot Shots team started

న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో హైదరాబాద్ హాట్ షాట్స్ జట్టు శుభారంభం చేసింది. ఇక్కడి సిరిఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో గురువారం జరిగిన పోరులో హైదరాబాద్ 3-2 తేడాతో అవధ్ వారియర్స్‌ను ఓడించింది. తొలి రెండు సింగిల్స్ నెగ్గిన హైదరాబాద్ 2-0తో ముందంజ వేసినా, ఆ తర్వాత వారియర్స్ పురుషుల డబుల్స్‌ను, మరో సింగిల్స్‌ను గెలవడంతో ఈ పోరు 2-2 వద్ద నిలిచింది. కీలకమైన మిక్స్‌డ్ డబుల్స్‌లో నెగ్గిన హాట్ షాట్స్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
 
  హాట్‌షాట్స్, వారియర్స్ మధ్య పురుషుల తొలి సింగిల్స్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. అవధ్ ఆటగాడు గురుసాయిదత్ మ్యాచ్ ఓడినా టనోంగ్‌సాక్ బూన్‌సుక్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. టనోంగ్ 15-21, 21-14, 11-9తో మ్యాచ్ గెలుచుకున్నాడు. అనంతరం మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 21-19, 21-8తో సింధును ఓడించడంతో హాట్‌షాట్స్‌కు 2-0 ఆధిక్యం దక్కింది. అయితే అవధ్ వారియర్స్ వెంటనే కోలుకుంది. పురుషుల డబుల్స్‌లో ఆ జట్టు ద్వయం మథియాస్ బో-మార్కిస్ కిడో 21-14, 21-20తో వి షెమ్ గో-కిమ్ వా లిమ్‌ను ఓడించింది.
 
  పురుషుల రెండో సింగిల్స్ మ్యాచ్‌లో కూడా ఫలితం వారియర్స్‌కు అనుకూలంగానే వచ్చింది. ఈ మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-17, 21-19తో అజయ్ జయరామ్‌పై విజయం సాధించాడు. దాంతో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. దాంతో చివరి మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌పై ఫలితం ఆధార పడింది. ఇందులో హాట్ షాట్స్ జోడి వి షెమ్ గో-ప్రద్య్నా గాద్రె 21-9, 19-21, 11-8తో అవధ్ జంట కిడో-సప్సిరీని ఓడించారు. ఫలితంగా మ్యాచ్‌ను హైదరాబాద్ హాట్ షాట్స్ 3-2తో సొంతం చేసుకుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement