హైదరాబాద్... ‘హాట్’ గురూ! | Hyderabad ... 'Hot' Guru! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్... ‘హాట్’ గురూ!

Published Sun, Sep 1 2013 1:14 AM | Last Updated on Fri, Sep 7 2018 4:39 PM

హైదరాబాద్... ‘హాట్’ గురూ! - Sakshi

హైదరాబాద్... ‘హాట్’ గురూ!

భారత్‌లో బ్యాడ్మింటన్ అడ్డా హైదరాబాద్... తొలిసారి అట్టహాసంగా నిర్వహించిన లీగ్‌లోనూ సత్తా చాటింది. అంచనాలను నిలబెట్టుకుంటూ మొదటి ఐబీఎల్‌లో విజేతగా అవతరించింది. టీమ్ ఐకన్ ప్లేయర్‌గా సైనా నెహ్వాల్ అజేయ రికార్డుతో ముందుండి నడిపించగా... సహచరులు సరైన విధంగా స్పందించడంతో హాట్‌షాట్స్‌కు గెలుపు దక్కింది. ‘స్ట్రైక్ హార్’్డ అనే తమ టీమ్ ట్యాగ్‌లైన్‌ను మరిపిస్తూ లీగ్‌పై ఈ జట్టు తమదైన ముద్ర వేసింది. మొత్తానికి తొలి ఐబీఎల్ అభిమానుల నుంచి అనూహ్య ఆదరణ దక్కించుకోవడంతో పాటు భారత్‌లో లీగ్ భవిష్యత్తుకు కూడా భరోసా కల్పించింది.
 
 ముంబై: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో తొలి విజేతగా పీవీపీ హైదరాబాద్ హాట్‌షాట్స్ నిలిచింది. శనివారం ఇక్కడ జరిగిన ఫైనల్ పోరులో హాట్‌షాట్స్ 3-1తేడాతో అవధ్ వారియర్స్‌ను చిత్తు చేసింది. పురుషుల తొలి సింగిల్స్‌లో శ్రీకాంత్ నెగ్గి వారియర్స్‌కు శుభారంభం ఇచ్చాడు.
 
 అయితే ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో సింధుపై సైనా సునాయాసంగా గెలవగా... పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ జోడిదే పైచేయి అయింది. కీలకమైన రెండో పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ అనూహ్యంగా చెలరేగి గురుసాయిదత్‌ను ఓడించడంతో టైటిల్ హాట్‌షాట్స్ వశమైంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన యువ క్రీడాకారిణి పీవీ సింధు ఐకన్‌గా ఉన్న అవధ్ వారియర్స్ రన్నరప్ స్థానంతో సంతృప్తి పడింది.
 
 చెలరేగిన శ్రీకాంత్
 పురుషుల సింగిల్స్‌లో తొలి మ్యాచ్ నెగ్గి శ్రీకాంత్ వారియర్స్‌కు శుభారంభాన్ని ఇచ్చాడు. అతను 21-12, 21-20తో హైదరాబాద్ ప్లేయర్ టనోంగ్‌సక్‌ను ఓడించాడు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడని ప్రపంచ 19వ ర్యాంకర్ టనోంగ్‌సక్ ఈ మ్యాచ్‌లో తడబడ్డాడు. మొదట్లో శ్రీకాంత్ 1-4తో వెనుకబడినా తేరుకొని ఒక్కసారిగా విజృంభించాడు. ఒక దశలో వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18-10తో ముందంజ వేసిన శ్రీకాంత్ దానిని నిలబెట్టుకుంటూ గేమ్ నెగ్గాడు. రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో 5-12తో వెనుకబడిన టనోంగ్‌సక్ 18-18కి తీసుకు వచ్చాడు. అయితే 19-20తో గేమ్ కోల్పోయే దశలో శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
 
 తిరుగులేని సైనా
 ప్రపంచ నాలుగో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఐబీఎల్‌లో తన ఐకన్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. ఆడిన ఏడు మ్యాచుల్లోనూ ఆమె గెలవడం విశేషం. లీగ్ దశలో అవధ్ క్రీడాకారిణి సింధును ఓడించిన సైనా... ఈసారి కూడా పైచేయి ప్రదర్శిస్తూ 21-15, 21-7తో పీవీ సింధును చిత్తు చేసింది. తొలి పాయింట్ నుంచే జోరు ప్రదర్శించిన సైనా 7-3తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది.
 
  తొలి బ్రేక్ అనంతరం సింధు కాస్త పోరాట పటిమ ప్రదర్శించింది. వరుస స్మాష్‌లతో పాయింట్లు నెగ్గి కోలుకునే ప్రయత్నం చేసింది. అయితే సైనా చక్కటి డ్రాప్ షాట్లతో ఆధిక్యాన్ని 14-9కి పెంచుకుంది. అనవసర తప్పిదాలతో హాట్‌షాట్ ప్లేయర్ కొన్ని పాయింట్లు కోల్పోయినా... చివరకు గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ అయితే పూర్తిగా ఏకపక్షంగా సాగింది. సైనా ఆట ముందు సింధు చేతులెత్తేసింది. ఆరంభంలో 7-1తో భారీ ఆధిక్యం కనబరిచిన నెహ్వాల్ ఆ తర్వాత దానిని 13-4కు పెంచుకుంది. చివర్లో అద్భుతమైన స్మాష్, డ్రాప్ షాట్‌తో వరుసగా రెండు పాయింట్లు సాధించి సైనా 35 నిమిషాల్లో మ్యాచ్ ముగించింది.
 
 జయరామ్ సంచలనం
 పురుషుల డబుల్స్‌లో హాట్‌షాట్స్ జోడి వి షెమ్ గో-లిమ్ కిమ్ వా 21-14, 13-21, 11-4 స్కోరుతో అవధ్ జంట మార్కిస్ కిడో-మథియాస్ బోపై విజయం సాధించింది. దీంతో హాట్‌షాట్స్ 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత రెండో పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ అద్భుత విజయంతో హాట్‌షాట్స్‌కు టైటిల్ అందించాడు.
 
  తొలి గేమ్‌లో ఓడిపోయినా అజయ్ ఆ తర్వాత పట్టుదలతో పోరాడి 10-21, 21-17, 11-7 తేడాతో గురుసాయిదత్‌పై విజయం సాధించాడు. ఓ దశలో గురుసాయి జోరుతో మ్యాచ్ కీలక ఐదో మిక్స్‌డ్ డబుల్స్‌కు వెళ్లేలా కనిపించినా... అజయ్ జయరామ్ అనూహ్యంగా పుంజుకుని హైదరాబాద్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement